Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
ప్రజల సొమ్ముకు పూర్తి భద్రత బ్యాంకులదేనని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు. గురువారం ఆయన మీడియాతో సీపీ మాట్లాడారు. మహేష్ బ్యాంక్ సర్వర్ హ్యాకింగ్ కేసులో దర్యాప్తు కొనసాగుతోందన్నారు. గతేడాది కూడా ఇలాంటి సంఘటన జరిగిందని గుర్తు చేశారు. మహేశ్ బ్యాంక్ కేసులో పురోగతి సాధించామన్నారు. ఇప్పటివరకు పలు ఖాతాల్లోని దాదాపు రూ.3 కోట్లు నిలుపుదల చేశామని చెప్పారు. ఖాతాలు తెరిచినవారి వివరాలు, తెరిపించిన వారి వివరాలు గుర్తించామన్నారు. బ్యాంక్ సర్వర్ హ్యాకింగ్ ఢిల్లీ నుంచి జరిగిందా లేదా విదేశాల నుంచి జరిగిందా అనే కోణంలో దర్యాప్తు జరుగుతోందన్నారు. హ్యాకింగ్ జరగడానికి ప్రధాన కారణం సర్వర్‌లో సమస్యలేనని తెలిపారు. నిర్లక్ష్యంగా ఉన్నందుకు బ్యాంక్‌పై కూడా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆన్లైన్ బ్యాంకింగ్‌కు సరైన సైబర్ సెక్యూరిటీ లేదన్నారు. మొత్తం రూ. 12.9 కోట్ల నగదును 3 ఖాతాల నుంచి దేశంలోని 120కిపైగా ఖాతాల్లోకి మళ్లించారని సీపీ తెలిపారు. ప్రజల సొమ్మును భద్రపర్చడం బ్యాంకుల బాధ్యత అని గుర్తు చేశారు. త్వరలో మహేశ్ బ్యాంక్ అధికారులతో సమావేశం నిర్వహించి, బ్యాంకులో కస్టమర్ల భద్రతకు తీసుకుంటున్న చర్యలపై చర్చిస్తామని తెలిపారు. కేసు దర్యాప్తులో ఉండడంతో పూర్తి వివరాలను తెలుపలేమన్నారు.