Authorization
Wed March 19, 2025 03:05:25 pm
నవతెలంగాణ-కూకట్పల్లి
కూకట్పల్లి సర్కిల్లోని ఆల్విన్ కాలనీ అక్రమ నిర్మాణాలకు అడ్డాగా మారుతోంది. నిబంధనలకు విరుధంగా చేపట్టే నిర్మాణాలను టౌన్‌ప్లానింగ్ అధికారులు అడ్డుకోకపోగా అక్రమార్కులకే అండగా నిలుస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. తాజాగా డివిజన్లోని తులసీనగర్‌లో మూడంతస్తుల నిర్మాణం కోసం అనుమతి తీసుకున్న ఓ వ్యక్తి (గోగుల)ఐదంతస్తులు నిర్మించారు. పేదలు చిన్నపాటి ఇల్లు నిర్మించుకోవాలంటే నానారకాల రూల్స్ పేరుతో వేధించే టౌన్‌ప్లానింగ్ ఆఫీసర్లు ఇక్కడ అనుమతికి మించి, నిబంధనలు అతిక్రమించి నిర్మాణం చేపట్టినా చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. అధికారులకు తెలిసే ఇదంతా జరుగుతోందని పలువురు చర్చించుకుంటున్నారు. పైగా ఈ అక్రమ నిర్మాణం ముందు రోడ్డుమీద నిర్మాణానికి సంబంధించిన మెటీరియల్ ఉంచడంతో రాకపోకలకు స్థానికులు అవస్థలు పడాల్సి వస్తోంది. భవన నిర్మాణం పూర్తయ్యాక కూడా ఇక్కడ ట్రాఫిక్, డ్రయినేజీ సమస్యలు తలెత్తే అవకాశం ఉందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టౌన్ ప్లానింగ్ విభాగం సిబ్బంది సహకరించడంవల్లనే అక్రమనిర్మాణాలు కొనకసాగుతున్నాయని ఆరోపిస్తున్నారు. ఇందుకు నిదర్శనం ధరణి నగర్‌లోని ప్లాట్ నంబర్ 79 అని చెప్పవచ్చు. ఇక్కడ నిర్మాణం పూర్తిగాక ముందే బయటి భాగం మొత్తం వైట్ పెయింట్ వేశారు. పాత నిర్మానంగా భావించి అదికారులు అటువైపు చూడరనే సలహాలను కొందరు టౌన్‌ప్లానింగ్ విభాగంవారే అక్రమ నిర్మాణదారులకు ఇస్తుండటంతో ఇలా చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఆల్విన్ కాలనీ మెయిన్‌రోడ్డులో, టీఆర్ఎస్ పాత కార్యాలయం వెనుక కూడా నాలుగు అంతస్తుల నిర్మాణం యథేచ్ఛగా కొనసాగుతోంది. ఇలాంటి అక్రమ నిర్మాణాలపై జోనల్ కమిషనర్, ఉపకమిషనర్, టౌన్ ప్లానింగ్ సిబ్బంది ఇకనైనా దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు.