Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బేగంపేట్
ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా రూ.కోట్ల వ్యయంతో అనేక అభివృద్ధి పనులు చేపడుతున్నట్టు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శనివారం సనత్‌నగర్ నియోజకవర్గ పరిధిలోని బన్సీలాల్ పేట డివిజన్లో రూ.3.43 కోట్ల విలువైన 12 అభివృద్ధి పనులను మంత్రి ప్రారంభించారు. ముందుగా బోయగూడలోని డాన్ బోస్కో స్కూల్ వద్ద రూ.8.50 లక్షలతో చేపట్టనున్న వాకింగ్ ట్రాక్, కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులను ప్రారంభించారు. సున్నం బట్టీ సమీ పంలో గల పార్క్ అభివృద్ధి పనులను ప్రారంభించిన అనం తరం పక్కనే ఉన్న ప్రభుత్వ పాఠశాల, అంగన్ వాడీ సెంటర్‌ను సందర్శించి సిబ్బందిని సమస్యల గురించి అడగ్గా, విద్యార్ధులకు సరిపడా బెంచీలు లేవని మంత్రికి విన్నవించగా, త్వరలోనే ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. అనంతరం జయప్రకాష్ నగర్లో రూ.6 లక్షలతో చేపట్టనున్న సీవరేజ్ పైప్ లైన్ పనులను ప్రారంభించారు. అక్కడి నుంచి గొల్ల కొమర య్య కాలనీలో గండమ్మ ఆలయం వద్ద రూ.5.75 లక్షలతో చేపట్టనున్న సీవరేజ్ పైప్ లైన్ పనులను, మెయిన్ రోడ్‌పై రూ.5.65 లక్షలతో చేపట్టనున్న సీవరేజ్ పైప్ లైన్, గొల్ల కొమరయ్య కమ్యునిటీ హాల్ నుంచి ఐడీహెచ్ ఆర్చి వరకు రూ.93.50 లక్షలతో నిర్మించనున్న పుట్ పాత్ నిర్మాణ పనులను ప్రారంభించారు. భోలక్ పూర్లోని మల్లిఖార్జున స్వామి ఆలయం వద్ద రూ.కోటీ 59 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు. మేకల మండి వెనుక రూ.9 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు. హనుమాన్ ఆలయం వద్ద రూ.15 లక్షలతో చేపట్టనున్న వాటర్ సప్లై లైన్ పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, కార్పొరేటర్ కుర్మ హేమలత, పద్మారావు నగర్ పార్టీ ఇన్చార్జి గుర్రం పవన్ కుమార్ గౌడ్, ముకుంద రెడ్డి, శ్రీధర్, సుదర్శన్, వాటర్ వర్క్స్ రమణారెడ్డి, టౌన్ ప్లానింగ్ క్రిస్టోఫర్ పాల్గొన్నారు.