Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
రాష్ట్రంలో దళితబంధు దేశంలోనే కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టనుందనీ, ఈ విషయంలో స్థానిక ఎమ్మెల్యేలు, ప్రజాప్రతి నిధులు, అధికారులు సమన్వయంతో పని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాష్ట్ర కార్మిక, ఉపాధికల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. శనివారం మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో దళితబంధు పథకంపై జిల్లా కలెక్టర్ హరీశ్, ప్రజాప్రతినిధులు, అధికారులతో మంత్రి కార్యాచరణ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన పథకాలను చూసి ప్రస్తుతం దేశంలోనే ఆదర్శంగా ఉన్నామనీ, ప్రస్తుతం సీఎం కేసీఆర్ దళితులను ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే పూర్తి కార్యాచరణ, పకడ్భందీ ప్రణాళిక రూపొందించామనీ, అందుకు అనుగుణంగా ముందడుగు వేస్తున్నట్టు తెలిపారు. మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా దళితబంధు పథకాన్ని విజయ వంతంగా అమలు చేసేందుకు ఇప్పటికే జాబితాను సిద్దం చేశారని పేర్కొన్నారు. మొదటి విడతలో నియోజకవర్గానికి 100 మంది చొప్పున ఐదు నియోజకవర్గాల్లో కలిపి మొత్తం 500 మంది దళితులను దళితబంధు పథకానికి ఎంపిక చేసినట్టు తెలిపారు. జిల్లాకు సంబంధించిన నిధులను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిందనీ, ఫిబ్రవరి మొదటి వారం వరకు లబ్దిదారుల ఎంపిక పూర్తి చేయాలనీ, అనంతరం లబ్దిదారుల పేరిట దళిత బంధు ప్రత్యేక బ్యాంక్ ఖాతాలు తెరవాలని సూచించారు. మార్చి 5లోగా గ్రౌండింగ్ అయ్యేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం దళితబంధు పథకం ద్వారా వచ్చే డబ్బులతో అనేక వ్యాపారాలు చేసుకోవచ్చనీ, ఈ నిధులతో సుమారు 30 రకాల వ్యాపారాలు నిర్వహించుకోవడానికి అవకాశం ఉంటుందని వివరించారు. జిల్లాలోని మేడ్చల్, కూకట్పల్లి, కుత్భుల్లాపూర్, మల్కాజిగిరి, ఉప్పల్ నియోజకవర్గాల్లో మొదటి దశ దళితబంధు పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తామని తెలిపారు. దళారీ వ్యవస్థ ఏమాత్రం ఉండకుండా పారదర్శకంగా ఉంటుందన్నారు. దళితులను ధనవంతులను చేయాలని సీఎం కేసీఆర్ దృఢ సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. దళితబంధు నిధులకు ఎలాంటి కొరత లేదన్నారు. ఈ పథకానికి సంబంధించి విధివిధానాలను అధికారులు సమయం ఇచ్చి లబ్ధిదారులకు వివరించాలని సూచించారు. ఈ విషయంలో అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. అన్ని పథకాలు విజయవం తమైనట్టే ఈ పథకం కూడా పక్కాగా విజయవంతం కావడంతో పాటు దేశానికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ప్రతి దళిత కుటుంబానికీ దళితబంధు అందేలా క్షేత్రస్థాయిలో పర్యటించి లబ్దిదారులు, అర్హులను గుర్తిస్తామన్నారు. ఈ విషయంలో ఎమ్మెల్యేలు, కలెక్టర్, ప్రత్యేక కమిటీ అధికారులతో సమావేశాలు నిర్వహించి అర్హులకే ఈ పథకం వర్తింపచేసేలా చర్యలు తీసుకు ంటున్నట్టు స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్ హరీశ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా దళితబంధు పథకాన్ని అమలు చేసేందుకు జాబితాలు రూపొందించే పనిలో అధికారులు, ప్రజాప్రతినిధులు నిమగమయ్యారన్నారు. ఈ మేరకు దళిత బంధుకు ఎంపికైన లబ్దిదారులకు ప్రత్యేకంగా బ్యాంకులో ఖాతాలను తెరిచి ఫిబ్రవరి నెలాఖరుకల్లా దళితబంధు నగదు రూ.10 లక్షలు వారి ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తుందన్నారు. జిల్లా వ్యాప్తంగా దళితబంధు అమలుకు జిల్లాలోని ఐదు నియోజకవర్గాలకు జిల్లా స్థాయి అధికారులైన ఐదుగురిని ప్రత్యేకాధికారులుగా నియమించడంతో పాటు అందుకు స్థానికంగా ఉండే ఎమ్మెల్యేలను సమన్వయం చేసుకుంటూ ప్రత్యేక అధికారులు అర్హులను ఎంపిక చేస్తారని తెలిపారు. పది లక్షల్లో గరిష్ఠంగా మూడు యూనిట్లు పెట్టుకొనే అవకాశం ఉందనీ, ఒకరు లేదా ఇద్దరు లేదా ముగ్గురు కలిసి ఒకే యూనిట్ పెట్టుకునే అవకాశం ఉందని సూచించారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో మొదటి దశలో 500 మంది దళితులకు ఈ పథకం వర్తింపచేసేందుకు రూ.50 కోట్లు నిధులను ప్రభుత్వం మంజూరు చేసిందనీ, నియోజకవర్గానికి వంద యూనిట్ల మేర ఐదువందల మందికి పథకాన్ని వర్తింపజేస్తామని తెలిపారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా పరిషత్ చైర్మెన్ శరత్ చంద్రారెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ విప్లవాత్మకంగా దళిత బంధు ప్రకటించి, విజయవంతంగా కార్యాచరణ చేపట్టారన్నారు. గ్రామం బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే ప్రతి అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలు దేశానికి దిక్సూచిగా మారాయన్నారు. కుత్భుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్ మాటా ్లడుతూ సీఎం కేసీఆర్ పేద, మధ్యతరగతి, దళితుల సంక్షేమానికి తోడ్పాటునందించేలా దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రగతి పథంలో పయనించేలా పథకాలను ప్రవేశపెడతారన్నారు. ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందరికీ చేరేలా ప్రభుత్వ యంత్రాంగం ఎంతగానో కృషి చేస్తోందనీ, ఇది అభినంద నీయమన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేస్తే అనుకున్న లక్ష్యాలను సాధించి తీరుతామన్నారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్లు నర్సింహారెడ్డి, శ్యాంసన్, ఆర్డీవోలు రవి, మల్లయ్య, ఎంపీడీవోలు, జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ బాలాజీ, జిల్లా అధికారులు, ఇతర ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.