Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వైస్ చైర్పర్సన్ చామ సంపూర్ణ
నవతెలంగాణ అబ్దుల్లాపూర్‌మెట్
తనపై వచ్చిన అవినీతి ఆరోపణలు అవాస్తవమని, అందులో ఏమాత్రం నిజం లేదని పెద్ద అంబర్‌పేట మున్సిపల్ వైస్ చైర్పర్సన్ చామ సంపూర్ణ విజయ శేఖర్ రెడ్డి అన్నారు. శనివారం పెద్ద అంబర్‌పేట మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వైస్ చైర్పర్సన్ చామ సంపూర్ణ విజయ శేఖర్ రెడ్డి, ఐదవ వార్డు కౌన్సిలర్ బొర్ర అనురాధతో కలిసి మాట్లాడుతూ తనపై వచ్చిన అవినీతి ఆరోపణలు నిజం కాదని, మహావీర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థ 32 లక్షలు ఇచ్చినట్లు ఓ టీవీ చానల్, పత్రికలో వచ్చిన కథనానికి వివరణ కోరుతూ కలెక్టర్ షోకాజ్ నోటీసులు జారీ చేశారని అన్నారు. పత్రికలలో వచ్చిన కథనం మేరకు తమకు తెలియడంతో కలెక్టర్‌ను కలిసి రాతపూర్వకంగా ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు. మహావీర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 32 లక్షలు ఇచ్చినట్లు మీడియాలో వచ్చిన కథనం కట్టు కథ అని అన్నారు. ఇట్టి విషయంపై రాచకొండ కమిషనర్ సమగ్ర విచారణ చేపట్టాలని వారు విజ్ఞప్తి చేశారు. అందుకు బాధ్యులైన దోషులను కఠినంగా శిక్షించాలని కోరారు. మహావీర్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ సంస్థ చేపట్టిన అక్రమ నిర్మాణాలను హెచ్ఎండిఏ ఎన్ఫోర్స్మెంట్, మున్సిపల్ అధికారులు కూల్చివేతలు చేపడితే తమపై ఆరోపణలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. తనకు డబ్బు ఇచ్చామని అసత్య ఆరోపణలు చేయడం వల్ల తమ పరువుకు భంగం కలిగిందని, వారిపై పరువు నష్టం కేసు పెడతామని తెలిపారు. అక్రమ నిర్మాణాలపై పలుసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు చర్యలు తీసుకోలేదని అన్నారు. మహావీర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేపట్టిన అక్రమ నిర్మాణం కూల్చివేసేవరకు ఊరుకునేది లేదని అన్నారు. అవసరమైతే మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు పసుల రాజేందర్, సామా అనూష రోహిత్ రెడ్డి, జోర్క గీత శ్రీరాములు, కోఆప్షన్ సభ్యులు అజీరా బేగం తదితరులు పాల్గొన్నారు.