Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
డ్రగ్స్ డాన్ టోనీని పంజాగుట్ట పోలీసులు ఐదురోజుల కస్టడీకి తీసుకున్నారు. దేశవ్యాప్తంగా ఏజెంట్లను ఏర్పాటు చేసుకున్న టోనీ బాడా వ్యాపారులకు, ప్రముఖులకు డ్రగ్స్ పరఫరా చేస్తూ నగర పోలీసులకు చిక్కిన విషయం తెలిసిందే. దేశంలో మొదటిసారీగా డ్రగ్స్ డాన్ టోనీ చిక్కడం సంచలనం రేపింది. ఇంత వరకు ఎవరికీి చిక్కని ఇంటర్నేషనల్ డ్రగ్స్ డాన్ డేవిడ్ అలియాస్ టోనీని విచారిస్తే బడాబాబుల బండారం గుట్టురట్టవుతుందని భావించిన నగర పోలీస్ అధికారులు టోనీని ఐదురోజుల కష్టడీకి తీసుకున్నారు. పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో కట్టుదిట్టమైన భద్రత మధ్య మొదటి రోజు టోనీ విచారణ కొనసాగింది. ప్రత్యేక ప్రశ్నావళి సిద్ధం చేసుకొని ప్రశ్నిస్తున్నట్టు తెలిసింది. అయితే టోనీ నైజీరియా జాతీయుడు కావడంతో ప్రత్యేకంగా పోలీసుటు ట్రాన్స్‌లేటర్‌ను ఏర్పాటు చేసుకున్నారని తెలిసింది. అరెస్ట్ అయిన తొమ్మిది మంది వినియోగదారులతో సంబంధాలపై ఆరా తీసినట్టు తెలిసింది. హైదరాబాద్‌లో ఇంకా ఎంతమందితో పరిచయాలు ఉన్నాయన్న కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.
టోనీ ప్రధాన అనుచరుడు ఇమ్రాన్, ఏజెంట్ నూర్‌లతో పరిచయాలపై ఆరా తీస్తున్నారని తెలిసింది. దేశవ్యాప్తంగా ఇంకా ఎంతమంది ఏజెంట్స్ ఉన్నారన్న కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. టోనీ కాల్ లిస్ట్‌లో ఉన్న ఫోన్ నెంబర్స్ ఎవరివి? ఆ వ్యక్తులు ఎవరు? 2019 నుంచి ఇప్పటి వరకూ ఎంతమందికి డ్రగ్స్ సరఫరా చేశారు? నైజీరియన్ స్టార్ బారు నుంచి ఎంత డ్రగ్స్ ఇండియాకు తరలించారు? దేశ వ్యాప్తంగా ఎంత మంది ఏజెంట్స్ ఉన్నారు? ఎన్ని మెట్రో పాలిటన్ సిటీస్‌లో డ్రగ్స్ సప్లై చేస్తున్నారు? అనే ప్రశ్నలకు పోలీసులు సమాధానాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా కోడ్ లాంగ్వేజ్ ద్వారా బడా వ్యాపారవేత్తలతో టోనీ అండ్ గ్యాంగ్ సంప్రదింపులు చేసినట్టు పోలీసులు గుర్తించినట్టు తెలుస్తోంది. టోనీ నోరువిప్పితే బడా వ్యాపారులు, సినీ ప్రముఖులు, రాజకీయ నాయకుల బండారం బయటపడే అవకాశముంది.