Authorization
Mon March 17, 2025 08:25:28 am
నవతెలంగాణ -ఎల్బీనగర్
బైరామల్ గూడలో జరుగుతున్న పనులను ఆదివారం ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లా డుతూ వరద నీటి కాల్వ పనులు పూర్తయితే కాలనీ వాసులకు వరదనీటి నుంచి పూర్తి స్థాయిలో విముక్తి కలుగుతుందన్నారు. దాదాపు రెండేండ్లుగా ఈ కాలనీల నందు జీహెచ్ఎంసీ అధికారులతో పలు సార్లు చర్చించి పక్కా ప్రణాళికలు సిద్ధం చేసి, డ్రైన్స్ ఎత్తు, పల్లాలు చూసుకుని నివేదిక తీసుకున్నట్టు తెలిపారు. ఈ డ్రైన్స్ పనులు మల్లికార్జుననగర్, శ్రీ కృష్ణ నగర్ గుండ బైరామల్ గూడ చెరువులోకి తీసుకెళ్లనున్నట్టు చెప్పారు. ఈ పనుల విషయంలో ఎన్ని అవాంతరాలు వచ్చినా వాటిని ఎదుర్కొని ప్రారంభించేలా కృషి చేశామన్నారు. రోడ్డు పక్కన ఉన్న ట్రాన్స్ఫార్మర్స్, కరెంట్ స్తంభాలను విద్యుత్ అధికారులతో సంప్రదింపులు జరిపి వాటిని యుద్ధప్రాతిపదికన పక్కకు జరిపిస్తామని తెలిపారు. రోడ్డు వెడల్పు పనులు కూడా చేపట్టనున్నట్టు తెలిపారు. గతేడాది కరోనా నేపథ్యంలో కొంతమేర ఆలస్యమైన మాట వాస్తవమే అన్నారు. చెరువు చుట్టూ అందమైన వాకింగ్ ట్రాకింగ్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. సేద తిరడానికి అందమైన బల్లలు, పూల మొక్కలను ఏర్పాటు చేస్తామన్నారు. ఈ చెరువు స్వరూపం మొత్తం మార్చి ప్రజలు ఇక్కడ వాకింగ్ చేయడానికి, కూర్చోవడానికి వీలుగా ఉండేలా అభివృద్ధి చేస్తామన్నారు. రాబోయే రెండు, మూడు నెలల్లో పనులు పూర్తవుతాయని చెప్పారు. ఎల్బీనగర్ నియోజవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు.