Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
సంక్రాంతి సెలవులు, కరోనా ఉధృతి నేపథ్యంలో తాత్కాలికంగా మూతబడిన విద్యాసంస్థలు ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి తెరుచుకోనున్నాయి. 24 రోజుల తర్వాత ప్రభుత్వ, ప్రయి వేటు బడులు, కళాశాలు, యూనివర్సిటీలు తిరిగి పని చేయను న్నాయి. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా స్కూళ్లు, కాలేజీలు, వర్సిటీల్లో ప్రత్యక్ష తరగతులు కొనసాగనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సంక్రాంతి సెలవుల అనంతరమే విద్యా సంస్థలు తెరుచుకోవాల్సి ఉండగా.. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ అలజడితో సర్కారు ఈ నెల చివరి వరకు సెలవులను పొడిగించింది. తాజాగా వైద్య, ఆరోగ్యశాఖ నివేదికను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం తిరిగి విద్యా సంస్థలను తెరవాలని నిర్ణయించింది.
హైదరాబాద్ జిల్లాలో 935 ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలు ఉండగా.. వీటిలో 1.20లక్షల మంది విద్యార్థులు చదువుతున్నా రు. 1745 ప్రయివేటు స్కూళ్లలో 8.62 లక్షల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. 22 ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, 15 ఎయిడెడ్, 13 రెసిడెన్షియల్, 1 రైల్వే డిగ్రీ కాలేజీ, 270 ప్రయివే టు కళాశాలలుండగా.. వీటిల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరంతో కలిపి 1.55 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వ్యాప్తి పెరగడంతో ప్రభుత్వం షెడ్యూల్ కంటే ముందుగానే పండుగ సెలవులను ప్రకటించింది. కరోనా ఉధృతి దృష్ట్యా జనవరి 30 వరకు పొడిగించింది. అదే సమయంలో 8,9,10 తరగతి విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులను ప్రారంభించిం ది. కానీ మొదటి నుంచి కూడా ఆన్లైన్ క్లాసుల పట్ల విద్యార్థులు పెద్దగా ఆసక్తి చూపించడం లేదనే విమర్శలున్నాయి. విద్యావే త్తలు, ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాల నేతలు విజ్ఞఫ్తులతో పాటు రాష్ట్రంలో పాజిటివిటీ రేటు తగ్గడంతో ప్రత్యక్ష తరగతుల నిర్వహ ణకు ప్రభుత్వం అనుమతినిస్తూ నిర్ణయం తీసుకుంది.
ఏర్పాట్లపై ఫోకస్!
ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి తిరిగి పాఠశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రయివేటు పాఠశాలల యాజమాన్యాలు శానిటైజేషన్తో పాటు పాఠశాలల పరిసరాల పరిశుభ్రంపై ప్రత్యేక దృష్టి సారించాయి. ఈ మేరకు ప్రభుత్వ పాఠశాలలను నగర పరిధిలో జీహెచ్ఎంసీ పారిశుధ్య కార్మికులతో పరిశుభ్రం చేయా ల్సి ఉంటుంది. ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు విద్యార్థులకు కొవిడ్ నిబంధనలకు సంబంధించి న పలు సూచనలతో కూడిన సందేశాలను వాట్సాప్ గ్రూప్లో పంపించారు. ప్రధానంగా మాస్కు ధరించడం, తరుచూ శానిటైజర్ వాడటం, భౌతిక దూరం పాటించడం, మధ్యాహ్న భోజన సమయం, మరుగుదొడ్లు, పరిశుభ్రతపై అవగాహన కల్పి స్తున్నారు. ప్రయివేటు స్కూళ్ల యాజమాన్యాలు కూడా వారి పాఠశాలలను శానిటైజేషన్తో పాటు పరిసరాలను పరిశుభ్రం చేయించే పనుల్లో నిమగమయ్యాయి. ప్రభుత్వం రూపొందించిన నిబంధనలకు అనుగుణంగా ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల యాజమాన్యాలు తరగతి గదుల్లో భౌతికదూరం పాటించేలా ఏర్పాటు చేస్తున్నారు. మాస్కులు, శానిటైజర్ వాడకం, ఐసోలేషన్ రూమ్లు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి.
విద్యాసంవత్సరాన్ని 'మే' వరకు పొడిగించాలి :
కె. ఉమమహేశ్వర రావు, జిల్లా అధ్యక్షులు, ప్రయివేటు పాఠశాలల యాజమాన్యాల సంఘం (ట్రస్మా)
విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా ప్రభుత్వం విద్యాసంవత్సరాన్ని 'మే' వరకు పొడిగించాలి. ఇలా చేస్తే పిల్లల చదువులకు ఆటంకం కలగదు. టీచర్ల ఉపాధికి ఇబ్బంది ఉండదు. ప్రత్యక్ష బోధనకు ప్రభుత్వం అనుమతించడాన్ని స్వాగతిస్తున్నాం. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా క్లాసుల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నాం. పిల్లల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటాం.