Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైటెన్షన్ వైర్లు అనుకొని ఐదు అంతస్తుల బిల్డింగ్ నిర్మాణం
పట్టించుకోని అధికారులు
నవతెలంగాణ-జూబ్లీహిల్స్
జూబ్లీహిల్స్ నియోజకవర్గం వెంగళ్రావునగర్ డివిజన్లో అక్రమ నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. సాయిబాబా ఆలయ సమీపంలో అనుమతి లేకుండా 250 గజాల స్థలంలో ఐదు అంతస్తుల భవనాన్ని స్థానిక బిల్డర్ అక్రమంగా ఇల్లు నిర్మిస్తున్నారు. ప్రక్కనే హైటెన్షన్ వైర్లు ఉన్నా, ప్రమాదమని తెలిసినా, కాలనీవాసులు హెచ్చరించినా, స్థానిక మహిళలు అడ్డుకున్నా, ఎవరినీ లెక్క చేయకుండా రాజకీయ నాయకుల అండదండలతో నిర్మాణం పూర్తి చేస్తున్నారు. అయితే టౌన్ ప్లానింగ్ అధికారులు గాని, ఎలక్ట్రికల్ అధికారులుగానీ, అక్రమ నిర్మాణాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయడం లేదు. ఇటీవల హైదరాబాద్ జిల్లాలో అనేక చోట్ల అక్రమ నిర్మాణాలపై జీహెచ్ఎంసీ అధికారులు ఉక్కు పాదంతో, నిర్మాణాలను తొలగిస్తున్నారని, మరీ వెంగళ్రావు నగర్ డివిజన్లో ఎందుకు అక్రమ నిర్మాణాలు ప్రోత్సహిస్తున్నారని కాలనీవాసులు చెప్పుకుంటున్నారు. దీనిపై ఎలక్ట్రికల్ ఏడీఈ, ఏఈకి ఫోన్ చేసి వివరణ అడిగితే అక్రమ నిర్మాణంపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని, ఫిర్యాదు చేస్తే తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.