Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దుండిగల్ మున్సిపల్ అధికారుల ఉదాసీనత
కిందిస్థాయి సిబ్బంది, చైన్‌మెన్‌లు కుమ్మక్కు
టీఎస్ బీ పాస్ చట్టం బేఖాతర్
నవతెలంగాణ-దుండిగల్
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలో రోజురోజుకూ అక్రమ నిర్మాణాలు, షెడ్లు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. డి. పోచంపల్లి, బౌరంపేట, బహుదూర్ పల్లి, గాగిల్లాపూర్, ఇంకా అనేక చోట్ల అక్రమ షెడ్లు, నిర్మాణాలు వెలుస్తున్నాయి. అక్రమ దారులు ఎటువంటి అనుమతులు లేకుండా, టీఎస్ బీపాస్ చట్ట నిబంధనలు బేఖాతర్ చేస్తూ నిర్మాణాలు కొనసాగిస్తున్నారు. ఇంత జరుగుతున్నా మున్సిపల్ అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్టు వ్యవహరించడం ఇక్కడ పరిపాటిగా మారింది. దుండిగల్ మున్సిపల్ మొత్తం కమిషనర్ ఒక్కడే పెద్దదిక్కుగా మారడం ఒకటైతే, ఇక్కడ విధులు నిర్వహించే టౌన్ ప్లానింగ్ అధికారి బదిలీ కావడంతో పట్టణ ప్రణాళిక విభాగంలో పైఅధికారులు ఎవరూ లేకపోవడంతో, కిందిస్థాయి చైన్ మెన్‌లే వార్డు నివేదికలు ఇవ్వవలసి ఉండడంతో వారు ఇచ్చే నివేదికలు, సమాచారమే కమిషనర్‌కు చేరుతోంది. దుండిగల్ మున్సిపాలిటీలో ఇప్పటివరకు టౌన్ ప్లానింగ్‌లో ఐదుగురు అధికారులు రావడం, బదిలీపై మరోచోటికి వెళ్ళడంతో మున్సిపాలిటీలో అధికారులు లేకపోవడంతో క్రింది స్థాయి సిబ్బందిని నయానో భయానో మచ్చిక చేసుకొని ఆక్రమణదారులు తమ పనికానిచ్చేస్తున్నారు. ఇష్టానుసారంగా జి ప్లస్ 4, 5, పలుచోట్ల సెల్లార్ నిర్మాణాలు కొనసాగుతున్నా పట్టించుకునే అధికారి లేకపోవడం, మున్సిపల్ ఆదాయానికి గండి కొడుతూ అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయి. బౌరంపేట్ పరిధిలో ఎప్పటినుండో కోర్టు వివాదాల్లో ఉన్న స్థలంలో అక్రమ నిర్మాణాలు, షెడ్లు, కొనసాగుతున్నా, ఈ విషయం మీడియా ద్వారా కమిషనర్ దష్టికి వెళ్లినా ఫలితం లేకుండా పోయింది. కమిషనర్ మాత్రం టౌన్ ప్లానింగ్ విభాగానికి తెలియజేసి మౌనం దాల్చడం పరిపాటిగా మారింది.ఇక్కడ టౌన్ ప్లానింగ్ అధికారి మరోచోట విధులు నిర్వహిస్తూ పదిహేను రోజులకొకసారి వచ్చి వెళ్లడంతో ఇబ్బందిగా మారుతోంది. చర్యలు తీసుకోవాల్సిన మున్సిపల్ కమిషనర్ కూడా చర్యలు తీసుకోకపోవడం, టాస్క్‌ఫోర్స్ విభాగం వారు భవిష్యత్తులో వారిపై చర్యలు తీసుకుంటారని ఉదాసీనతతో వ్యవహరిస్తుండటం గమనార్హం. ఇప్పటికే దుండిగల్ మున్సిపల్ పరిధిలోని మల్లంపేట్‌లో లక్ష్మీ శ్రీనివాస కన్‌స్ట్రక్షన్ 260 అక్రమ విల్లాల కేసుపై కలెక్టర్ ఆదేశాలతో నిర్మాణాలను తొలగించి సీజ్ చేసినా, ఇటీవల వాటిని తొలగించి కలెక్టర్ ఆదేశాలను కూడా ఆక్రమణదారులు, కొందరు అవినీతి అధికారులు బేఖాతర్ చేశారు. ఇంత జరుగుతున్నా మున్సిపల్ కమిషనర్ మాత్రం పట్టించుకోవడం లేదని స్థానికులే పేర్కొంటున్నారు. పై అధికారులు పట్టించుకోకపోవడంతో, కిందిస్థాయి అధికారులు, చైన్‌మెన్‌లు, కొన్నిచోట్ల స్థానిక కౌన్సిలర్లు కలిసి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ కమిషనర్ అక్రమ నిర్మాణ దారులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.