Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హయత్నగర్
కేంద్ర బడ్జెట్ ప్రజా, కార్మిక, రైతు, యువజన వ్యతిరేక బడ్జెట్ అని సీపీఐ(ఎం) హయత్నగర్ సర్కిల్ కార్యదర్శి కీసరి నర్సిరెడ్డి అన్నారు. గురువారం బడ్జెట్ను నిరసిస్తూ ఆ పార్టీ ఆధ్వర్యంలో హయత్నగర్లో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా నర్సిరెడ్డి మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం మొత్తం 42శాతం లోటు బడ్జెట్ ప్రవేశపెట్టిందని, ఇది భవిష్యత్తులో ప్రజల మీద అన్ని రకాలుగా దాడిచేసే ఉద్దేశంగా ఉందని తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థలను విక్రయించడం, ఎల్ఐసీ, రైల్వే, విమానయాన రంగాలను విక్రయించి నిధులు సమకూ ర్చుకోవడానికి సిద్ధపడటం అత్యంత దారుణమని అన్నారు. ప్రజల చేతిలో ఒక్కశాతం సంపద ఉంటే, కోటీశ్వరుల చేతిలో 70 శాతం సంపద ఉందన్నారు. అధిక సంపద కలిగినవారిపై పన్నులు వేయకుండా మొత్తం ప్రజల మీద వేయడానికి పాలకులు సిద్ధమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ బడ్జెట్లో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాల కల్పన గాని, రైతాంగానికి మద్దతు ధర గాని, వ్యవసాయ కార్మికులకు ఊరటగాని లేవన్నారు. మొత్తానికి ఇది ప్రజలు, కార్మికులు, రైతులు, యువతకు వ్యతిరేకంగా కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఉందన్నారు. వైద్య రంగానికి తగినన్ని నిధులు కేటాయించలేదన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) నాయకులు భీమనపల్లి కనకయ్య, దోనూరు కష్ణారెడ్డి, పిసాటి నర్సిరెడ్డి, మద్దెల కష్ణ, సతీష్ తదితరులు పాల్గొన్నారు.