Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
భారత రాజ్యాంగం వల్లనే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు అయి అదే రాజ్యాంగాన్ని మార్చాలి అని వ్యాఖ్యలు చేస్తున్న టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను నియోజకవర్గ పొలిమేర్ల వరకు తరిమికొట్టాలని ఓయూ బహుజన విద్యార్థి సంఘాలు, జేఏసీ పిలుపునిచ్చింది. గురువారం సాయంత్రం ఆర్ట్స్ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బహుజన స్టూడెంట్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు వేల్పుల సంజరు, ఓయు జేఏసీ చైర్మెన్ కొత్తపల్లి తిరుపతి మాట్లాడుతూ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం వైఫల్యాలు నిరుద్యోగం, 317 జీఓ, రైతులు, కార్మికులు, మహిళలు, యువతకు జరిగిన అన్యాయాలు, అంతేకాకుండా కాళేశ్వరం ప్రాజెక్టు కాంట్రాక్టర్‌గా ఉన్న మెగా ఇంజినీరింగ్ లిమిటెడ్ కంపెనీ అవినీతి, నీటిపారుదల శాఖ స్పెషల్ సెక్రెటరీగా ఉన్న రజత్ కుమారుపై వచ్చిన అవినీతి ఆరోపణలు కప్పిపుచ్చుకోవదానికి ప్రజలను తప్పుదారిపట్టించడానికి కేసీఆర్ ఆడుతున్న నాటకంలో ఇదంతా భాగమేనని అన్నారు. కేసీఆర్ తన వాఖ్యలను వెంటనే వెనక్కు తీసుకొని ప్రజలకి క్షమాపణ చెప్పాలన్నారు. కార్యక్రమంలో అంబేద్కర్, గదరాజు జోషి, శ్రీనివాస్ గౌడ్, కొండల్, భాస్కర్, కుమార్, రాజు, శివ, సందీప్, ఆంజనేయులు, మహేష్ తదితరులు పాల్గొన్నారు.