Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ముషీరాబాద్
కేంద్ర బడ్జెట్ కేటాయింపులో దళిత ఆదివాసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని దళిత బహుజన శ్రామిక యూనియన్ (డీబీఎస్యూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి. నర్సింహ్మా అన్నారు. కేంద్ర బడ్జెట్ కేటాయింపులపై గురువారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీలకు లక్షా 82 వేల 976 కోట్లు కేటాయించాల్సి ఉండగా, కేవలం లక్షా 42 వేలు కోట్లు, ఎస్టీలకు 98 వేల 664 కోట్లు కేటాయించాల్సి ఉండగా కేవలం 89 వేల కోట్లు మాత్రమే ఇవ్వడం దారుణం అన్నారు. బీజేపీ గత ఐదేండ్లలో జనాభా నిష్పత్తి ప్రకారం నిధులు కేటాయించక పోవడం వల్ల 9 లక్షల 89 వేల 315 కోట్లు దళిత, ఆదివాసీలు నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిధులు 6 వేల కోట్లు మాత్రమే కేటాయించడం అమానుషం అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రాజ్యాంగాన్ని మార్చాలని చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో డీబీఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడు బి.నర్సింలు, పీపుల్స్ మానిటరింగ్ కమిటీ రాష్ట్ర కన్వీనర్ ఎస్.శివలింగం, డీబీఎఫ్ జాతీయ కార్యదర్శి పి.శంకర్, మాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల రాంప్రసాద్, డీబీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పులి కల్పన, నాయకులు సి. ఆనందం, జి.జ్యోతి, పి.అనూష తదితరులు పాల్గొన్నారు.