Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షులు
మేడి పాపయ్య
నవతెలంగాణ-అడిక్మెట్
బడుగుల ఆరాధ్య దైవం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ని అవమానిస్తే ఎవరిని ఉపేక్షించేది లేదని ఎమ్మార్పీఎస్ జాతీయ, రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపయ్య, వంగపల్లి శ్రీనివాస్ అన్నారు. భారత రాజ్యాంగాన్ని అవహేళన చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ ప్రజలందరికీ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గురువారం విద్యానగర్లోని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తన జీవితాన్ని త్యాగం చేసి ఈ దేశానికి అతిపెద్ద లిఖిత ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని అందించారని గుర్తుచేశారు. ఆర్టికల్ 3లో చిన్న రాష్ట్రాల ఏర్పాటు అనే అంశాన్ని పొందుపరచడం ద్వారానే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాడనే విషయం మర్చిపోవడం ఆయన అజ్ఞానానికి నిదర్శనం అని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని నీరుగార్చాలని చూస్తే తమ ప్రాణాలను పణంగా పెట్టి దాన్ని కాపాడుకున్నామని చెప్పారు. అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేస్తున్నామని, ఆయన్ను చిన్నచూపుచూసే వారిని వదిలి పెట్టమని హెచ్చరించారు. సీఎం కేసీఆర్ దేశ ప్రజలందరికీ క్షమాపణలు చెప్పాలని లేకుంటే తగిన బుద్ధి చెబుతామన్నారు. సమావేశంలో ఎమ్మార్పీఎస్ కోర్ కమిటీ సభ్యులు పసులది యాదగిరి, మంచాల యాదగిరి, శ్రీనివాస్, రవి, ఎంఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కొల్లూరి వెంకట్, వర్కింగ్ ప్రెసిడెంట్ చందు, ఓయూ నాయకులు నాగరాజు, రవి తదితరులు పాల్గొన్నారు.