Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
థర్డ్‌వేవ్ కరోనా తర్వాత ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రయివేటు పాఠశాలల్లో ప్రత్యక్ష బోధన ప్రారంభమైన సంగతి తెలిసిందే. సంక్రాంతి సెలవుల తర్వాత ఫిబ్రవరి ఫస్టు నుంచి విద్యార్థులు క్రమంగా బడులకు వస్తున్నారు. అయితే హాజరు శాతంలో మాత్రం నిలకడలేదని, హెచ్చుతగ్గులు ఉంటాయని అధికారిక సమాచారం ఆధారంగా తెలుస్తోంది. గడిచిన అయిదురోజులుగా స్కూళ్లకు విద్యార్థులు హాజరయ్యే శాతం పెరుగుతూ.. తగ్గుతోంది. ఇందుకు కోవిడ్ భయం ఒకటి తొడైతే.. మరొకటి హైకోర్టు ప్రత్యక్ష తరగతులతో పాటు ఆన్లైన్ క్లాసులు నిర్వహించాలని చెప్పడంతో బడి హాజరుపై కొంత మేర ప్రభావం చూపింది. దీనికితోడు అక్కడక్కడ కరోనా కేసులు రావడం, చిన్న పిల్లలు మాస్క్ ధరించడం ఇబ్బందిగా ఉండడం, భౌతికదూరం పాటించలేరన్న కారణంతో పేరెంట్స్ తమ పిల్లలను పాఠశాలలకు పంపడం లేదు. ఫలితంగా ఈ అయిదు రోజులుగా జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రయివేటు స్కూళ్లలో 40లోపే హాజరు నమోదు అవుతోంది. మరోవైపు ప్రయివేటు స్కూళ్ల యాజమాన్యాలు ఇప్పటికే ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తుండగా.. హైకోర్టు తాజా ఆదేశాల మేరకు ప్రభుత్వ స్కూళ్లలో ఈనెల 28 వరకు ఆఫ్‌లైన్‌తో పాటు ఆన్లైన్లో పాఠాలు బోధించనున్నారు. మరో నాలుగైదు రోజులు ఆగితే విద్యార్థుల హాజరు నమోదు పెరిగే అవకాశం ఉందని ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు చెబుతున్నారు.
పెరుగుదల ఇలా..
సర్కారు బడుల్లో విద్యార్థుల హాజరు ఈనెల 1వ తేదీన 38.37శాతం, 2న 37.75శాతం, 3న 38.57శాతం, 4న 40.27శాతం, 5న 39.12శాతం నమోదైంది. ఇక ప్రయివేటు పాఠశాలల్లో ఈనెల 1న 33.13 శాతం, 2న 33.60, 3న 33.55, 4న 33.70,5న 32.24శాతం శాతం నమోదైంది. ఎయిడెడ్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. మొత్తంగా గత అయిదురోజులుగా ప్రత్యక్ష బోధనకు విద్యార్థుల హాజరు శాతం పెరుగుతూ..తగ్గుతూ ఉన్నట్టు స్పష్టమవుతోంది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు స్కూళ్లకు హాజరు కాని విద్యార్థులతో మాట్లాడుతు న్నారు. కానీ వారిని స్కూళ్లకు రమ్మని ఒత్తిడి తీసుకువచ్చే పరిస్థితి లేదని పేర్కొంటున్నారు. ఆన్లైన్ లేదా ఆఫ్‌లైన్ క్లాసులకు పంపాలా లేదా అనేది తల్లిదండ్రుల నిర్ణయానికి వదిలేసినట్టు వివరిస్తున్నారు.
ఈనెల 28 వరకు ఆన్లైన్ పాఠాలు
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఉధృతి నేపథ్యంలో ఈ నెలాఖరు వరకు ఆన్లైన్ క్లాసులు కూడా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టుకు రెండు రోజుల క్రితం ఆదేశాలు జారీ చేసింది. వివిధ పరిస్థితుల కారణంగా ఎవరైనా విద్యార్థుల ప్రత్యక్ష క్లాసులకు హాజరు కాకుంటే ఆన్లైన్ బోధన కొంతమేర ఉపయోగకరంగా ఉంటుందని విద్యారంగ నిపుణులు సూచిస్తు న్నారు. అయితే జిల్లాలో పరిస్థితులు మరోరకంగా ఉన్నాయి. గతంలో కరోనాతో బడులు మూతపడినప్పుడు ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆన్లైన్ విధానంలో బోధన చేపట్టిన సమయంలో చాలా తక్కువ మంది విద్యార్థుల ఆన్లైన్ క్లాసులకు హాజరైన విషయాన్ని గుర్తుచేసుకుంటున్నారు.