Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ముషీరాబాద్
ఉచిత వైద్యం ప్రజలందరి హక్కు అని లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు తుమ్మనపల్లి శ్రీనివాస్ అన్నారు. పేదలకు సకాలంలో వైద్య సేవలు అందకపోవడం వల్ల చిన్న చిన్న జబ్బులకు దేశ వ్యాప్తంగా ఏటా 6 కోట్లు, రాష్ట్రంలో 19 లక్షల మంది పేదరికంలో దిగజారిపోతున్నట్టు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అల్పాదాయ వర్గాల వారికి పైసా ఖర్చు లేకుండా అందరికీ ఉచితంగా వైద్య సేవలు అందించాలని, అందుకు లోక్సత్తా రూపొందించిన కుటుంబ ఆరోగ్య వ్యవస్థ నమూనాని అమలు చేయాలని డిమాండ్ చేశారు. బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో లోక్సత్తా పార్టీ అధ్యక్షులు తుమ్మనపల్లి శ్రీనివాస్ అధ్యక్షతన ఆదివారం రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కుటుంబ ఆరోగ్య వ్యవస్థపై లోక్సత్తా రూపొందించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. సగటు మనిషి తన ఆదాయంలో రూ 60 వైద్యానికే వెచ్చించాల్సి వస్తోందని అన్నారు. దీంతో వైద్యం అత్యవసర సేవ కావడంతో తీవ్ర అనారోగ్యంతో చికిత్సల భారం మోస్తున్న వారు 25 శాతం ఉంటారని అన్నారు. సామాన్య ప్రజలకు జబ్బులు వస్తే .. వాళ్ల ఖర్మలే అని వదిలేయకుండా ప్రభుత్వాలు ఆదుకోవాలన్నారు. లేదంటే , వైద్యం అవసరాలతో ఇబ్బందులు పడే వారు అత్యంత దయనీయ పరిస్థితులను ఎదుర్కొంటారని అన్నారు. ఈ నెలాఖరున రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న వార్షిక బడ్జెట్లో ఆరోగ్య రంగానికి అదనంగా రూ .1900 కోట్లు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. లేదంటే ఈ అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లోకి తీసుకెళ్లి ఉద్యమం చేపట్టనున్నట్టు తెలిపారు. ఈమేరకు జెట్టె రవి కోకన్వీనర్గా ప్రచార బందాన్ని నియామకం చేశారు. సమావేశంలో లోక్సత్తా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నందిపేట రవీందర్, గజానని, ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాస వర్మ, కార్యదర్శులు మల్లాది కిషోర్ తదితరులు పాల్గొన్నారు.