Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
దశాబ్దాల తరబడి జీవితాన్ని కూచిపూడి నాట్యానికి చిత్తశుద్ధితో అంకితం చేసిన యోగిని, తపస్విని డాక్టర్ పద్మజా రెడ్డి అని భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఎల్.వి.గంగాధర్ శాస్త్రి అభినందించారు. తెలుగు కళా సమితి, దోహా-ఖతార్ ఆధ్వర్యంలో జింఖానా క్లబ్లో పద్మశ్రీ పురస్కార ప్రకటిత డాక్టర్ పద్మజా రెడ్డికి ఆత్మీయ అభినందన సత్కారం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళా రంగానికి జీవితం అంకితం చేయడంలో శాశ్వత ఆనందం ఉందన్నారు. నాట్యం అభ్యసించి పరిశోధించి విశ్వ విఖ్యాతమై మహోన్నత లక్ష్యంతో ఎందరినో తీర్చిదిద్దిన పద్మజా రెడ్డికి పద్మశ్రీ లభించడం సముచితం ఔన్నత్యం అని, తెలుగు జాతికి గర్వకారణం అని ప్రశంసించారు. డాక్టర్ పద్మజా రెడ్డి మాట్లాడుతూ అయిదు దశాబ్దాల తన కృషి ఫలించిందని, కేంద్ర ప్రభుత్వం గుర్తించి ప్రతిష్టాత్మక పద్మశ్రీ ప్రకటించడం జన్మ ధన్యమైనదని సంతోషం వ్యక్తం చేశారు. ఈ పురస్కారం తన బాధ్యతను మరింతగా పెంచిందని, గురువు దివంగత శోభానాయుడుకు అంకితం చేస్తున్నట్టు ప్రకటించారు. తెలుగు కళాసమితి అధ్యక్షులు ఉసిరికల తాతాజీ అధ్యక్షత వహించిన సభలో సీనియర్ పాత్రికేయులు ఎ.ప్రభు, డాక్టర్ మహ్మద్ రఫీ, మాధవి సిద్ధం, అమెరికా ఆటా ప్రతినిధులు కె.సత్యనారాయణ రెడ్డి, జి.రామచంద్రారెడ్డి, కథక్ పండిట్ అంజుబాబు, కలయిక నారాయణ తదితరులు పాల్గొన్నారు. దయా ఆస్పత్రి డైరెక్టర్ వి.ఆర్.ఆర్.పద్మజ, డాక్టర్ మహ్మద్ రఫీ పర్యవేక్షించారు.