Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి కష్ణ స్వరూప్
నవతెలంగాణ-హిమాయత్‌నగర్
కర్ణాటక రాష్ట్రంలోని బీజేపీ కాషాయ పాలనలో ఉడిపి జిల్లాలోని విద్యా సంస్థల్లో హిజాబ్ ధరించిన ముస్లిం విద్యార్థులను అనుమతించకపోవడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు, ప్రజాస్వామిక లౌకిక కూటమి జాతీయ కన్వీనర్ వడ్లమూరి కష్ణ స్వరూప్ తెలిపారు. సోమవారం హిమాయత్‌నగర్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రకారం దేశంలోని పౌరులు తమకు నచ్చిన డ్రెస్‌ను ధరించవచ్చునని, ఇది రాజ్యాంగమిచ్చిన హక్కు అన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ మనువాదుల పాలనలో విద్యా సంస్థలను కాషాయమయం చేయడం అత్యంత కుట్రపూరితమని ఆరోపించారు. ఇలాంటి విధానం తొలుత ముస్లింలపై ఆ తరువాత క్రిస్టియన్, బౌద్ధ, సిక్కు, దళిత జాతులపై అమలు చేసి దాడులు చేసే అవకాశం ఉందన్నారు. బీజేపీ ఫాసిస్ట్ క్రిమినల్ ఆలోచనలను వ్యతిరేకించకపోతే దళిత బహుజన జాతులకు భవిష్యత్ ఉండదన్నారు. అప్రజాస్వామిక, అలౌకిక చర్యలపై ప్రజలు తిరగబడాలని సూచించారు. బీజేపీ పాలనలో మైనారిటీల మానవ హక్కులు కాలరాయబడుతున్నాయన్నారు. దేశంలో బీజేపీ పాలిత రాష్ట్రలలో కుల హింస, మత హింస, జాతుల మధ్య హింస చెలరేగి అంతర్యుద్ధం వచ్చే ప్రమాదం ఉందని ఆరోపించారు. భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా బీజేపీ ప్రభుత్వం జాతి, దేశ వ్యతిరేక పాలన, దేశద్రోహ పాలనపై ప్రజలు ముఖ్యంగా దళిత బహుజన సమాజం తిరుగుబాటు చేయాలని ఆయన సూచించారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చేపూరి రాజు, లౌకిక కూటమి రాష్ట్ర ఇన్చార్జి సిలివెరి వసంతరావు, కూటమి సభ్యులు కె.శ్యామ్ కుమార్, పార్టీ గ్రేటర్ అధ్యక్షులు మద్దెల ప్రవీణ్ కుమార్, మాల మహానాడు గ్రేటర్ అధ్యక్షులు ఎం.ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.