Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చర్యలు తీసుకోవాలంటూ అధికారులకు వినతి
సికింద్రాబాద్ పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు పి.సాయిబాబా
నవతెలంగాణ-సిటీబ్యూరో
నగరంలో ట్రాఫిక్ సమస్యలను పక్కనపెట్టి చలాన్లురాయడమే ధ్యేయంగా పోలీసులు పనిచేస్తున్నారని సికింద్రాబాద్ పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు పి.సాయిబాబా అన్నారు. ట్రాఫిక్ సమస్యలపై చర్యలు తీసుకోవాలంటూ గురువారం డీజీపీని కలిసి వినతిపత్రం అందజేసేందుకు టీడీపీ నాయకులు ప్రయత్నించారు. అయితే డీజీపీ అందుబాటులో లేకపోవడంతో డీజీపీ కార్యాలయంలో పోలీస్ అధికారులకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పి.సాయిబాబా మాట్లాడుతూ నగరంలో రోడ్లు గుంతలమయమై వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. చిన్న చిన్న కారణాలు చూపించి ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు వేలకువేలు చలాన్లు విధిస్తున్నారని ఆరోపించారు. ఆటోలు నడుపుకునే వారు, చిరు వ్యాపారులపై భారీ జరిమానాల పేరుతో ట్రాఫిక్ పోలీసుల ద్వారా ప్రభుత్వం వేధింపులకు గురిచేస్తోందన్నారు. కొందరు వాహనదారులు చలానా కట్టలేదంటూ పోలీసులు వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. దాంతో సామాన్యులు వాహనం నడిపించాలంటేనే భయాందోళనకు గురవుతున్నారన్నారు. జరిమానాలు, చలాన్లు వసూలు చేయడం మానుకుని ట్రాఫిక్ నియంత్రణపై దృష్టి సారించాలన్నారు. ట్రాఫిక్ వ్యవస్థను పటిష్ట పర్చాలని పోలీసులను కోరారు. ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రసిడెంట్ నల్లెల్ల కిషోర్ కుమార్, ప్రధాన కార్యదర్శి పి.బాలరాజ్‌గౌడ్, రాష్ట్ర ఎస్సీసెల్ ఉపాధ్యక్షులు జి.యాదగిరిరావు, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పెద్దోజు రవీంద్రాచారి పాల్గొన్నారు.