Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి
జిల్లా సెక్టోరియల్ అధికారి రజిత
నవతెలంగాణ-సిటీబ్యూరో
రీడ్..ఎంజాయి అండ్ డెవలప్ కార్యక్రమాన్ని ప్రతి విద్యార్థి సద్వినియోగం చేసుకోవాలని జిల్లా సెక్టోరియల్ అధికారి శ్రీపతి రజిత పిలుపునిచ్చారు. గురువారం స్థానిక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల కాలడేరాలో వంద రోజుల 'చదువు ఆనందించు అభివృద్ధి చెందు' కార్యక్రమంలో భాగంగా ఆమె పాల్గొని మాట్లాడారు. కరోనా కారణంగా రెండేండ్లుగా పాఠశాలకు దూరమైన విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంపొందించడంతో పాటు సామూహిక అభ్యాసనతో తమను తాము తర్ఫీదు చేసుకోవడం కోసం ఈ 'రీడ్' అభ్యాసన విధానాన్ని అమలు చేస్తున్నారనీ, ప్రతి విద్యార్థి దీనిని ఉపయోగించుకోవాలన్నారు. విద్యార్థులు పాఠ్య పుస్తకాలే కాక వివిధ కథల పుస్తకాలు, వార్తా పత్రికలు, మ్యాగజైన్లు, పద పట్టికలు చదవగలిగే సామర్థ్యం కలిగి ఉండాలన్నారు. ప్రతి పాఠశాలలో తప్పనిసరిగా ఒక గ్రంథాలయం ఉండాలనీ, విద్యార్థి ప్రతి పోటీలలో ఉత్సాహంగా పాల్గొనేటట్టు చూడాలని ఆమె కోరారు. ఈ సందర్భంగా విద్యార్థులచే కొన్ని కథల పుస్తకాలను చదివించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు మందడి వెంకటరెడ్డి, మండల ఉపపర్యవేక్షణాధికారి నెహ్రూ బాబు, ఉపాధ్యాయులు అమ్మాజి, జయలక్ష్మి, నిర్మల, రేష్మ, హృదయ, మేరీ, సీఆర్పీలు శ్రీను నాయక్, నాగేందర్ పాల్గొన్నారు.