Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
నవతెలంగాణ-బేగంపేట్
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సనత్నగర్ నియోజకవర్గ పరిధిలో కోట్లాది రూపాయలతో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి ప్రజల సమస్యలను పరిష్కరించామని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం బన్సీలాల్పేట డివిజన్లోని డీ క్లాస్ ప్రాంతంలో కార్పొరేటర్ కుర్మ హేమలత, వివిధ శాఖల అధికారులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాత్రివేళ బస్తీలో తిరగాలంటే ఇబ్బందికరంగా ఉందని, స్ట్రీట్ లైట్స్, డ్రయినేజీ లైన్ ఏర్పాటు, పార్సిగుట్ట ఖాళీ స్థలంలో పెరిగిన చెట్ల కొమ్మల తొలగింపు, ప్రహారీగోడ నిర్మాణం, డీ క్లాస్ పార్క్ అభివృద్ధి, కమ్యూనిటీ హాల్ నిర్మాణం తదితర సమస్యలను మంత్రికి విన్నవించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటానని, తన దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని చెప్పారు. మంత్రి వెంట జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ ముకుంద రెడ్డి, హార్టికల్చర్ అధికారి రాఘవేందర్, ఈఈ సుదర్శన్, ఎలెక్ట్రికల్ డీఈ శ్రీధర్, ఏఈ రవీందర్, వాటర్ వర్క్స్ జీఎం రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.