Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మాల మహానాడు జాతీయ అధ్యక్షులు పబ్బతి శ్రీకృష్ణ
నవతెలంగాణ-హిమాయత్‌నగర్
భారత రాజ్యాంగం ప్రకారం తెలంగాణ ప్రజల ప్రజా పోరాటం ద్వారా సాధించిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై దేశ ప్రధానిగా ఒక బాధ్యత కలిగిన జాతీయ పార్టీ ప్రధాన నాయకులుగా నరేంద్ర మోడీ యావత్ తెలంగాణ ప్రజలను అవమానించారని, అందుకు ఆయన ప్రజలకు క్షమాపణలు చెప్పాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షులు పబ్బతి శ్రీకష్ణ డిమాండ్ చేశారు. గురువారం హిమాయత్‌నగర్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటు ప్రజాస్వామ్యయుతంగా డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ సూచించిన ఆర్టికల్-3 ప్రకారం చిన్న రాష్ట్రాల ఏర్పాటులో భాగంగా జరిగిందని గుర్తు చేశారు. ఈ విషయాన్ని కావాలని అటు ఆంధ్రప్రదేశ్ మిత్రులను రెచ్చగొట్టే విధంగా ప్రధాని మాట్లాడటం శోచనీయమన్నారు. పార్లమెంట్‌లో బడ్జెట్ సమావేశంలో ఆయన దేశానికి ఏం చేశారో చెప్పాలి. అంతేగాని ప్రజలను తప్పుతోవ పట్టించే విధంగా ప్రసంగం చేయడం దుర్మార్గమన్నారు. తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. భారత రాజ్యాంగం మార్చాలని బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ప్రతిసారీ ప్రయత్నించడం మానుకోవాలని సూచించారు. ఉత్తర భారతదేశంలో ఎన్నికల నేపథ్యంలో మైనారిటీ ప్రజల స్త్రీల దుస్తులపై నిషేధం పెట్టడం వ్యక్తిగత స్వేచ్ఛను హరించడమేనని అన్నారు. అన్ని మతాలు, కులాల సంగమమే భారతదేశం అని, కనీస జ్ఞానం లేకుండా దేశాన్ని పాలించడం ఈ దేశ ప్రజల దౌర్భాగ్యమన్నారు. ప్రధానంగా తెలంగాణ ప్రజలు మోడీ చేసిన తప్పుడు ప్రచారాలను ఎండగట్టాలని ఆయన సూచించారు. సమావేశంలో మాలమహానాడు రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.