Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జూబ్లీహిల్స్
వివిధ నేరాల అభియోగంపై మాజీ రిజర్వ్ ఇన్స్పెక్టర్ అల్లం కిషన్ రావును జూబ్లీహిల్స్ పోలీసులు గురువారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఏసీపీ సుదర్శన్, ఇన్స్పెక్టర్ రాజశేఖర్‌రెడ్డి, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రమేష్ తెలిపిన వివరాల ప్రకారం కరీంనగర్‌కు చెందిన ఎం. అబ్బాస్ అనే వ్యక్తి కృష్ణానగర్‌లో ఉన్న తన భూవివాదాన్ని పరిష్కరించేందుకు యూసఫ్‌గూడ పోలీస్ క్వార్టర్స్‌లో ఉంటున్న మాజీ పోలీస్ అధికారి అల్లం కిషన్ రావుకు రూ. 39 లక్షలు ఇచ్చారు. ఎన్నిరోజులైనా భూవివాదం పరిష్కారం కాకపోవడంతో తన డబ్బులు తిరిగి ఇవ్వాలని అబ్బాస్ అతనిపై ఒత్తిడి తెచ్చాడు. కిషన్‌రావు తాను డీఐజీ అధికారిని అని, డబ్బులు అడిగితే తుపాకీ చూపించి బెదిరించాడని, అంతేకాకుండా తనకున్న పలుకుబడితో మర్డర్, రేప్ కేసులో ఇరికిస్తానని బెదిరించినట్లు అబ్బాస్ ఈనెల 8న జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు విచారణలో భాగంగా 9న యూసఫ్‌గూడ పోలీస్ క్వార్టర్స్‌లో ఉంటున్న కిషన్ రావును అరెస్టు చేసి సోదాలు నిర్వహించారు. రెండు ఎయిర్ రైఫిల్స్, ఎయిర్ గన్, పిస్టోల్ ఆకారంలో ఉన్న సిగరెట్ లైటర్, కట్టల కొద్దీ ప్రామిసరీ నోట్లు, పాత కరెన్సీ నోట్లు, 61 మద్యంసీసాలు, రెండు టయోటా ఫార్చునర్ కార్లు, మహీంద్రా స్కార్పియో, ఫోర్ట్ ఫిష్ట, మారుతి సుజుకీ బ్రీజా కారు స్వాధీనం చేసుకున్నారు. గతంలో కిషన్ రావు ఏఆర్ విభాగంలో ఆర్ఎస్ఐగా పనిచేసి అనేక నేరారోపణలపై సస్పెండ్ అయ్యాడు. అతని తమ్ముడు యాదగిరి రావు గ్రేహౌండ్స్‌లో ఆర్ఎస్ఐగా పనిచేస్తూ 2010లో జరిగిన బలిమెల ఎన్కౌంటర్లో మృతి చెందాడు. యాదగిరి పేరు మీద ఇవ్వబడిన యూసుఫ్‌గూడాలోని పోలీస్ క్వార్టర్స్‌లో ఉంటూ అనేక నేరాలకు పాల్పడినట్లు జూబ్లీహిల్స్ పోలీసులు ఆధారాలు సేకరించారు. కిషన్‌రావుపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇంకా లోతైన విచారణ జరిపిస్తామని, ఇంకా ఎవరైనా బాధితులు ఉంటే ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని, వాటిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పారు.