Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ గంజాయి, గుట్కా, గ్యాంబ్లింగ్,
అ రేషన్ బియ్యం విక్రయాలపై ప్రత్యేక దృష్టి
అ నేరసమీక్ష సమావేశంలో
పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్
నవతెలంగాణ-ఖమ్మం
దేశ భవిష్యత్తును నిర్ణయించే యువత గంజాయి, మత్తు పదార్థాల బారిన పడ కుండా మత్తు పదార్థాల సరఫరా, ఉత్పత్తి చేస్తున్న వారిపై ఉక్కుపాదం మోపాలని పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ పోలీస్ అధికారులకు ఆదేశించారు. గురువారం స్పెషల్ బ్రాంచ్ కాన్ఫరెన్స్ హల్లో నేర సమీక్ష సమావేశంలో జరిగింది. ఈ సమావేశంలో పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ.. జిల్లా పరిధిలో వందశాతం గంజాయిని నియంత్రించి గంజాయి రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యంగా ముందుకు పోవాలన్నారు. గంజాయి రవాణాకు పాల్పడిన నిందితులపై అవకాశాన్ని బట్టి వారిపై పీడీ యాక్ట్‌ను నమోదు చేయాలన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి జిల్లా మీదుగా రవాణా అవుతున్న గంజాయితో పాటు జిల్లాలో గంజాయి సరఫరా నియంత్రణ లక్ష్యంగా పోలీస్ యంత్రాంగం పటిష్టమైన చర్యలు చేపట్టి ఫలితాలు రాబట్టాలని సూచించారు. జిల్లాలోని హైవేల వెంట ఉన్న దాబాలలో మద్యం విక్రయాలతో పాటు అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నట్లు పలు ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో విచారణ చేపట్టి ఆయా ప్రాంతాల్లో నిఘా పెట్టాలని అధికారులకు ఆదేశించారు.
పోలీస్ స్టేషన్ల పరిధిలో అక్రమాలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత స్టేషన్ హౌస్ ఆఫీసర్ దని అన్నారు. గంజాయి , గుట్కా, గ్యాంబ్లింగ్, రేషన్ బియ్యం విక్రయాలపై ప్రత్యేక దృష్టి సారించి నియంత్రించాలని అన్నారు. అనవసరమైన విషయాలలో కలగజేసుకుంటే శాఖాపరమైన క్రమశిక్షణా చర్యలు తప్పవని అన్నారు. పోలీస్ స్టేషన్లకు వచ్చే బాధిత ఫిర్యాదుదారులు వేచి చూడకుండా తక్షణమే స్పందించాలని, అస్తి, భూ వివాదాలలో పరిష్కారం కోసం వచ్చే బాధితులను న్యాయస్థానాలను ఆశ్రయించేలా సూచనలు ఇవ్వాలని సూచించారు. ఈ సమావేశంలో డీసీపీ ఇంజరాపు పూజ, అడిషనల్ డీసీపీ లా అండ్ ఆర్డర్ సుభాష్ చంద్ర బోస్, అడిషనల్ డీసీపీ (ఏఆర్) కుమారస్వామి, ఏఎస్పీ స్నేహ మెహ్రా, ఏసీపీలు అంజనేయులు, వేంకటేశ్, భస్వారెడ్డి, ప్రసన్న కుమార్ , విజయబాబు, సిఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.