Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఎల్బీనగర్
మార్నింగ్ వాక్‌లో భాగంగా శుక్రవారం ఉదయం గడ్డిఅన్నారం డివిజన్ పరిధిలోని కోదండరాం నగర్, సరూర్ నగర్ చౌడి, జోనల్ కమిషనర్ కార్యాలయం, చైతన్య పూరి నాలా తదితర ప్రాంతాల్లో అధికారులతో కలిసి ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పాదయాత్ర చేశారు. సరూర్ నగర్ చెరువు ఔట్ లేట్ దగ్గర నుంచి చౌడి, జోనల్ కమిషనర్ కార్యాలయం, చైతన్యపురి మూసీ నాళా వరకు డ్రైన్ మంజూరైనట్టు ఎమ్మెల్యే తెలిపారు. పనులు అతి త్వరలో ప్రారంభం కానున్నట్టు తెలిపారు. కోదండరాం నగర్ మీదుగా కృష్ణానగర్, శ్రీ నగర్ కాలనీ మీదుగా చైతన్యపురి నాలా వద్ద మరో ప్రత్యామ్నాయంగా మరో బాక్స్ డ్రైన్ నిర్మాణం చేపట్టే విధంగా అనుమతులు తీసుకున్నట్టు తెలిపారు. కోదండరాం నగర్, కృష్ణానగర్, శ్రీ నగర్ కాలనీ మీదుగా చైతన్యపురి నాలా వద్ద కలిపే విధంగా మరో ఆలోచన ఉన్నట్టు తెలిపారు. డ్రైన్స్ నిర్మాణ పనుల మీద కాలనీవాసులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. వచ్చే వర్షాకాలంలోపు పనులు పూర్తి చేయాలని సూచించారు. న్యూ గడ్డిఅన్నారం కాలనీలో పై నుంచి వచ్చే వర్షపునీటి సమస్యల కోసం ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. రాబోయే రోజుల్లో వరదనీరు కాలనీల రోడ్ల మీద ప్రవహించకుండా ప్రత్యేక బాక్స్ డ్రైన్స్ నిర్మాణ పనులు చేపట్టేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ భవాని, ప్రవీణ్ కుమార్, సీనియర్ నాయకులు బిచేనేపల్లి వెంకటేశ్వరరావు, తులసి, శ్రీనివాస్, ఎస్ఎన్డీపీఎస్ఈ భాస్కర్ రెడ్డి, ఈఈ కృష్ణయ్య పాల్గొన్నారు.