Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఉప్పల్
రాష్ట్ర ప్రభుత్వం కేజీ టు పీజీ విద్యను అమలు చేస్తుందనీ, మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం చిల్కానగర్ డివిజన్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఈ లైబ్రరీని మంత్రి మల్లారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్ గీతతో కలిసి ప్రారంభించి మాట్లాడారు. గ్రంథాలయాలు ఎంతోమంది యువకులకు చదువుకోవడానికి, పోటీ పరీక్షలకు ఉపయోగపడతాయన్నారు. మేడ్చల్ జిల్లాలో రెండు అధునాతమైన లైబ్రరీలను ప్రారంభించామన్నారు. ఈ గ్రంథాలయాలు విద్యార్థులకు, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే యువకులకు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. సీఎం కేసీఆర్ కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అందించే లక్ష్యంతో పని చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం విద్యా బోధన, సాంఘిక సంక్షేమ హాస్టల్స్ ద్వారా ప్రతి విద్యార్థికీ నాణ్యమైన ఆహారం, వసతులతో పాటు విద్యా బోధన చేస్తున్నామన్నారు. రాష్ట్రంలోని అన్ని గ్రంథాలయాలనూ డిజిటల్‌గా మార్చుతామన్నారు. స్థానిక కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ మాట్లాడుతూ గ్రంథాలయ భవనానికి రూ.కోటి నిధులు కేటాయించి అందుబాటులోకి తీసుకువచ్చినందుకు సీఎం కేసీఆర్, మంత్రులు సబితా ఇంద్రా రెడ్డి, మల్లా రెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్‌రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్, ఏదుల కొండల్ రెడ్డి, వీబీ నరసింహ, బజారు జగన్ గౌడ్, నేర్డం భాస్కర్, జెల్లీ మోహన్, ప్రధాన కార్యదర్శి కొక్కొండ జగన్, పండ్ల కిషన్, అంబటి జగదీష్ పాల్గొన్నారు.