Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలంగాణ సైకాలజిస్టుల అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ మోతుకూరి రాంచందర్
నవతెలంగాణ-హిమాయత్‌నగర్
సైకాలజిస్టులకు కౌన్సిల్ ఏర్పాటు చేయవలసిన అవసరం ప్రభుత్వంపై ఉందని తెలంగాణ సైకాలజిస్టుల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మోతుకూరి రాంచందర్ అన్నారు. ఆదివారం హిమాయత్‌నగర్‌లోని సత్యనారాయణరెడ్డి భవన్లో ఏర్పాటు చేసిన సంఘం రాష్ట్ర నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 'నేషనల్ కమిషన్ ఫర్ అలైడ్ అండ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ బిల్-2020' చట్టంగా రూపుదిద్దుకుని, ఏడాది కావస్తున్నా దీనిపై ప్రభుత్వం ఇంత వరకు ఎలాంటి చర్య తీసుకోలేదని ఆరోపించారు. దీని ద్వారా సైకాలజిస్టుల కౌన్సిల్ ఏర్పాటుకు అవకాశం ఏర్పడుతుం దన్నారు. మనస్తత్వవేత్తలకు వారి వృత్తి గురించి భరోసా ఇవ్వడానికి ప్రభుత్వం వెంటనే మనస్తత్వవేత్తల మండలిని ఏర్పాటు చేయాలని కోరారు. ఈ విషయంలో గతంలో ప్రభుత్వానికి పలుమార్లు వినతి పత్రాలు అందజేయడం జరిగిందని గుర్తుచేశారు. మనస్తత్వవేత్తలలో నైపుణ్యం అభివృద్ధి చెందడం, వారిని ప్రొఫెషనల్స్‌గా తయారు చేయడమే తమ అసోసియేషన్ లక్ష్యంగా ముందుకు సాగుతుందన్నారు.
ఈనెల 15 నుంచి మార్చి 15 వరకు నిర్వహించే సభ్యత్వ నమోదు కార్యక్రమంలో సంఘం నాయకులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. సమావేశంలో అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి ఎ.సుధాకర్, ఉపాధ్యక్షులు డాక్టర్ కె.షర్మిల, డాక్టర్ మనోహరన్, డాక్టర్ హుంలా గురూ, నాయకులు మజ్జిగ శ్రీకాంత్, సుబ్బారాయుడు, వైదేహి పాల్గొన్నారు.