Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
కరోనా నేపథ్యంలో ఈ ఏడాది విద్యాసంస్థలు ఆలస్యంగా తెరుచుకున్నాయి. దాదాపు మూడు నెలలు ఆలస్యంతో సెప్టెంబర్‌లో బడుల్లో ప్రత్యక్ష తరగతులు ప్రారంభమయ్యాయి. సరిగ్గా నాలుగు నెలలు పాటు ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగినా ప్రత్యక్ష తరగతులకు.. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ రూపంలో బ్రేక్ పడింది. ఒమిక్రాన్ ఉధృతి దృష్ట్యా ప్రభుత్వం సంక్రాంతి సెలవులకు ముందే పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. అనంతరం దాదాపు 24 రోజుల తర్వాత ఈనెల ఒకటోవ తేదీ నుంచి మళ్లీ ప్రత్యక్ష క్లాసులతో పాటు ఆన్లైన్ పాఠాలు కొనసాగుతున్నాయి. తాజాగా వైద్యశాఖ థర్డ్‌వేవ్ ముగిసిందని ప్రకటించడంతో ఇప్పుడిప్పుడే బడుల్లో విద్యార్థుల హాజరు పెరుగుతోంది. మరోవైపు జిల్లా యంత్రాంగం ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇప్పటికే పది వార్షిక పరీక్షలకు సంబంధించిన ప్రక్రియను ప్రారంభించింది. పదికి సంబంధించి రాష్ట్ర విద్యాశాఖ గత నెలలోనే పరీక్ష ఫీజు గడువును ప్రకటించింది. తొలుత ఎలాంటి రుసుము లేకుండా జనవరి 29వ తేదీ వరకు ఉండగా.. కరోనా, సంక్రాంతి సెలవుల పొడిగింపుతో అదికాస్త ఫిబ్రవరి 14వ తేదీ వరకు పొడిగించింది. అపరాధ రుసుముతో మార్చి 24వరకూ చెల్లించేందుకు అవకాశం ఇచ్చింది. తాజాగా పదో తరగతి వార్షిక పరీక్షల షెడ్యూల్‌ను కూడా విడుదల చేసింది. దీంతో విద్యార్థులు పరీక్షలకు సిద్ధమవుతున్నారు. విద్యాశాఖ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తోంది. జిల్లాలోని పాఠశాలల్లో విద్యార్థుల వివరాలు ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థుల వివరాలతో పాటు పరీక్ష ఫీజు చెల్లింపు చేయాలని జిల్లా విద్యాశాఖ పరీక్షల విభాగం ఇప్పటికే పాఠశాలల నిర్వాహకులకు సూచించింది.
జిల్లాలో ప్రభుత్వ, ఏయిడెడ్, ప్రయివేటు పాఠశాలలు మొత్తం 2824 ఉన్నాయి. వీటిల్లో పది విద్యార్థులు 72,560 వరకు ఉంటారు. వారికి సంబంధించి జిల్లాలోని ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల యాజమాన్యాలు ఫీజు చెల్లింపుతో పాటు వివరాలను ఆన్లైన్ నమోదు చేస్తున్నాయి. ఫీజు చెల్లింపుతో పాటు విద్యార్థుల నామినల్ రోల్స్ వివరాలు ఎప్పటికప్పుడు జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి పంపిస్తున్నారు. పదో తరగతి వార్షిక పరీక్ష ఫీజు చెల్లింపు కోసం విద్యార్థి వయసు 14ఏండ్లు దాటి ఉండడంతో పాటు 31 ఆగస్టు 2008కు ముందు జన్మించి ఉండాలి. వయసు తక్కువగా ఉంటే వయసు క్షమాపణ (ఏజ్ కండోనేషన్) పత్రం సమర్పించాలి. లోకల్ బాడీ, ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల విద్యార్థులకు 18 నెలల పాటు ప్రధానోపాధ్యాయులు, రెండేండ్ల వరకు జిల్లా విద్యాశాఖ అధికారి అనుమమతించేందుకు అవకాశం ఉంది. రెండేండ్ల వయసు వరకు సర్దుబాటు చేయడానికి విద్యార్థి రూ.300 చలానా చెల్లించడంతో పాటు మెడికల్, జనన ధ్రువీకరణ పత్రాలు జతచేసి దరఖాస్తు చేసుకోవాలి. కాగా ఇప్పటివరకు ఏమైనా కారణాలరీత్యా ఆన్లైన్ లో నమోదు చేసుకోని వారికి డైరెక్టర్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ అనుమతి పొందాలి. వారు ప్రభుత్వం అనుమతి తీసుకోవాలి. అనంతరం ప్రభుత్వం నుంచి అనుమతి వస్తేగానీ తత్కాల్ పద్ధతిలో రూ.1000 అపరాధ రుసుము ఫీజు చెల్లించుకునే అవకాశం లభిస్తోంది. లేదంటే ఈ ఏడాదికి అవకాశం కోల్పోయి నట్టేనని విద్యాశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. ఆన్లైన్లో విద్యార్థుల వివరాలు నమోదు చేసే సమయంలో నిర్వహకులు తప్పు లేకుండా చూసుకోవాలని విద్యాశాఖ అధికారులు సూచిస్తున్నారు.
పరీక్ష ఫీజులోనూ కక్కుర్తి!
నగరంలోని ప్రయివేటు విద్యాసంస్థలు పరీక్ష ఫీజుల్లోనూ కక్కుర్తి చూపిస్తున్నాయి. సర్కారు నిబంధనలకు తిలోదకాలిస్తూ.. నిర్ణీత ఫీజు కన్నా పది రెట్లు అధికంగా పరీక్ష ఫీజులను వసూలు చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రుల దగా చేస్తున్నాయి. వాస్తవానికి పదవ తరగతి పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ఎస్ఎస్సీ బోర్డు ప్రకటించిన నిర్ణీత గడువులోగా రూ.125 ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. కానీ ప్రయివేటు స్కూళ్ల యాజమాన్యాలు ఆన్లైన్లో విద్యార్థుల వివరాల అప్లోడ్, ఇతర పేపర్ వర్క్‌తో పాటు అంతర్గత మార్కులను బూచిగా చూపి అడ్డగోలుగా రూ.500 నుంచి 3వేల వరకు వసూలు చేస్తున్నాయి. అంతేగాక కొన్ని విద్యాసంస్థలు ఈ విద్యాసంవత్సరానికి సంబంధించిన పెండింగ్ ట్యూషన్ ఫీజులను చెల్లిస్తేనే పబ్లిక్ పరీక్షల ఫీజు కట్టుకుంటామని తేల్చి చెబుతుండడంతో తల్లిదండ్రులు లబోదిబో మంటున్నారు. అప్పులు చేసి మరి కడుతున్నట్టు వాపోతున్నారు. విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేద్దామంటే.. పిల్లల భవిష్యత్తు దృష్ట్యా యాజమాన్యాలకు భయపడి దూరంగా ఉంటున్నారు. అయితే ప్రయివేటు స్కూళ్ల దోపీడీపై అధికారులకు తెలిసినా ఫిర్యాదులు లేకుండా చర్యలు తీసుకోలేమంటున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు వచ్చి ఫిర్యాదు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు.