Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఘట్కేసర్ రూరల్
క్రీడలు శారీరక, మానసిక ఎదుగుదలకు దోహదం చేస్తాయని ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి అన్నారు. ఘట్కేసర్ మండలం కొర్రెముల గ్రామంలోని మునుకుంట్ల రమేష్ హనుమాన్ కబడ్డీ అకాడమీ ఆధ్వర్యంలో మూడు రోజులుగా జరిగిన కబడ్డీ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో మంగళవారం ఆయన పాల్గొని టోర్నమెంట్లో మొదటి స్థానంలో హైదరాబాద్ టీమ్, రెండో స్థానంలో మాస్టార్ స్పోర్ట్స్ టీమ్‌లు నిలవగా వారికి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ కొర్రెముల గ్రామానికి చెందిన మునుకుంట్ల రమేష్‌గౌడ్ 26వ వర్ధంతి సందర్భంగా రాష్ట్ర స్థాయి కబడ్డీ క్రీడా పోటీలు ఇక్కడ నిర్వహించడం గొప్ప శుభపరిణామమన్నారు. ఈ గ్రామానికి చెందిన రమేష్ గౌడ్ అంతర్జాతీయ స్థాయిలో కబడ్డీలో పాల్గొనడం వల్ల ఘట్కేసర్ పేరు జాతీయస్థాయిలో రావడానికి ముఖ్య కారకుడు ఆయ్యారనీ, ఆయనను స్ఫూర్తిగా తీసుకుని యువత క్రీడల్లో పాల్గొని ఉన్నత స్థానాలకు వెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఓరుగంటి వెంకటేష్ గౌడ్, ఎంపీటీసీలు వినోద నాగార్జున్, పులకండ్ల భాస్కర్ రెడ్డి, మీర్పేట్ సీఐ మహేందర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ బద్రి నారాయణ గౌడ్, వార్డు సభ్యులు దయ్యాల ఆంజనేయులు, టీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షులు మొగుల్ల సంతోష్ గౌడ్, మాజీ సర్పంచ్ భైనగారి నాగరాజ్, మాజీ ఉపసర్పంచ్ బొడ్డు నాగార్జున, నాయకులు కోళ్ళ యాదగిరి, మాటూరి రవి, తదితరులు పాల్గొన్నారు.