Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ముషీరాబాద్
రాజ్యాంగ పరిరక్షణ కోసం మార్చి 4న భైంసా పట్టణంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు వంచిత్ బహుజన్ ఆగాడి పార్టీ తెలంగాణ రాష్ట్ర కో ఆర్డినేటర్ ఉమ్మడి ఆనంద్ తెలిపారు. ఈ బహిరంగ సభకు అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్ హాజరు కానున్నట్లు తెలియజేశారు. మంగళవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో 'ప్రమాదంలో భారత రాజ్యాంగం' అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆనంద్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే రెండుసార్లు రాజ్యాంగాన్ని మార్చాలని వ్యాఖ్యలు చేశారని, టీఆర్ఎస్ దళిత ప్రజాప్రతినిధులు ఆత్మ గౌరవం లేకుండా బతుకుతున్నారని విమర్శించారు. అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్ 3 ద్వారా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైందని ముఖ్యమంత్రి గుర్తు పెట్టుకోవాలి అన్నారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం దళిత బహుజనులు అంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. పెరిగిన జనాభాకు అనుగుణంగా దళితులకు 19 శాతం రిజర్వేషన్లు కల్పించాలని అన్నారు. కార్యక్రమంలో బెల్లి కృష్ణ యాదవ్, విజరు కుమార్, ఎర్రమల రాములు, జహంగీర్ భాష, దర్శన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.