Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
ఉమ్మడి రాష్ట్రాల విభజనలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో విలీనం చేసిన భద్రాచలంలోని ఐదు పంచాయతీలను తిరిగి తెలంగాణలో కలపాలని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మెన్ పిడమర్తి రవి డిమాండ్ చేశారు. ఓయూ జేఏసీ ఆధ్వర్యంలో గురువారం ఆర్ట్స్ కళాశాల న్యూ సెమినార్ హాల్లో భద్రాచలానికి సంబంధించి ఐదు పంచాయతీల విషయంపై విద్యార్థి నాయకులు, మేధావులతో ఉమ్మడి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల విభజన నాటినుంచి భౌగోళికంగా తెలంగాణలో ఉన్న భద్రాచలంలోని ఐదు పంచాయతీల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఐదు పంచాయతీలను తెలంగాణకు అప్పజెప్పడం ద్వారానే సమస్య పరిష్కారం అవుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ సమస్యను తీర్చాల్సిన బాధ్యత కేంద్రంపై ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చొరవతీసుకోవాలని విజ్ఞప్తిచేశారు. లేకపోతే ఓయూ జేఏసీ, ఐదు పంచాయతీల ప్రజలతో కలిసి ఉధృత పోరాటాలు చేస్తామన్నారు. సమావేశంలో బహుజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నగేష్, బంజారా భేరి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భరత్ నాయక్, జాతీయ అనుసూచిత సంఘం కార్యదర్శి నాగరాజు, యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవీన్, వేణు, వాసు, వెంకట్, సంతోష్, ప్రశాంత్, తిరుపతి, గణేష్, సురేష్ పాల్గొన్నారు.