Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్/దుండిగల్
తెలంగాణ రాష్ట్రానికి మరో కలికి తురాయి కండ్లకోయలోని గేట్ వే ఐటీ పార్కు అని, ఐటీ రంగంలో తెలంగాణ దేశంలోనే తలమానికంగా ఉందని ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా గుండ్ల పోచంపల్లి మున్సిపల్ పరిధిలోని కండ్లకోయలో గేట్ వే ఐటీ పార్కు ఏర్పాటుకోసం గురువారం ఆయన శంకుస్థాపన చేశారు. లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఐటీ ఇండిస్టీ విషయంలో అంతర్జాతీయ స్థాయిలో మనం పేరు ప్రతిష్టలు సంపాదించామన్నారు. హైదరాబాద్ విశ్వనగరానికి ఉత్తర దిశలో ఉన్న మేడ్చల్ ప్రాంతం, ఐటీ కంపెనీల ఏర్పాటుకు ఎంతో అనువుగా ఉంటుందన్నారు. ఇక్కడ ఐటీపార్కు ఏర్పాటు చేయాలని మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే వివేకానంద, ఎమ్మెల్సీలు కోరారని చెప్పారు. సీఎం కేసీఆర్ జన్మదినోత్సవం రోజున ఐటీ పార్కు శంకుస్థాపన చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరు తమకంటూ ఒక లక్ష్యాన్ని ఏర్పర్చుకొని, ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలని, అప్పుడే విసయం సాధ్యమవుతుందని అన్నారు. సీఎం కేసీఆర్ అలా చేయడంవల్లే నేడు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామని గుర్తు చేశారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడి ఏడెనిమిది సంవత్సరాలవుతున్న తరుణంలో ప్రపంచంలోనే పెద్ద సంస్థ అయిన అమెజాన్ కంపెనీ ఇక్కడికి వచ్చిందన్నారు. అన్ని రంగాల్లోనూ తెలంగాణ అభివృద్ధి దిశగా పయనిస్తోందని చెప్పారు.
ఒకవైపు ఇండిస్టీలు పెరుగుతున్నాయని మరోవైపు ఆయా కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయని, ఇది మన రాష్ట్రానికి ఎంతో గర్వకారణమని కేటీఆర్ అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి మాట్లాడుతూ.. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులు ఉన్న హైదరాబాద్ మహానగరానికి మేడ్చల్- మల్కాజిగిరి ప్రాంతంలోని కండ్లకోయలో గేట్ వే పార్కును ఏర్పాటు చేయడం, అందులోనూ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజున ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో టీఎస్ఐఎస్సీ చైర్మెన్ గ్యాదరి బాలమల్లు, ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, నవీన్ కుమార్, జడ్పీ చైర్మెన్ శరత్ చంద్రారెడ్డి, జిల్లా కలెక్టర్ హరీశ్, కుత్భుల్లాపూర్, కూకట్పల్లి ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద్, మాధవరం కృష్ణారావు, ఐటీ, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేష్ రంజన్, నర్సింహా రెడ్డి, జడ్పీటీసీలు, ఎంపీపీలు సర్పంచులు జిల్లా, మండల అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.