Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ొఇబ్బందుల్లో 20 కాలనీవాసులు,
ఉద్యోగులు, విద్యార్థులు
ొపట్టించుకోని అధికారులు
నవతెలంగాణ-సిటీబ్యూరో
రాష్ట్రంలో ప్రజా రవాణా వ్యవస్థ మరింత అధ్వానంగా మారింది. ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన బస్సుల్లో సగం కూడా ఆర్టీసీ నడపడం లేదు. జాతీయ సేవాస్థాయి ప్రమాణాల ప్రకారం నగరాల్లో లక్ష మందికి 60 బస్సులుండాలి. ఈ లెక్కన గ్రేటర్లో 6 వేలకు పైగా బస్సుల అవసరం ఉంది. వాటిలో సగం బస్సులను కూడా ఆర్టీసీ నడపడం లేదు. నష్టాల పేరుతో ప్రస్తుతం 2,800 బస్సులను నడుపుతున్నా ట్రిప్పుల సంఖ్య 25 వేలకు మించడం లేదు. రద్దీ రూట్లలో తప్ప ఇతర రూట్లలో బస్సుల ట్రిప్పులు తగ్గించడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. కాలనీవాసులు, విద్యార్థులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కొన్ని కాలనీలకు ఒక్క బస్సుకూడా వెల్లడం లేదంటే అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది.
రెండేండ్లుగా కానరాని '18 ఆర్' బస్సు
సికింద్రాబాద్ నుంచి ఓల్డ్ రామంతాపూర్‌కు వెళ్లేందుకు 18 ఆర్ బస్‌లే దిక్కు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, జూబ్లీ బస్టాండ్‌కు వివిధ జిల్లాల, ప్రాంతాల నుంచి వేలాది మంది ప్రయాణికులు ప్రతి రోజు వచ్చిపోతుంటారు. అలాంటి వారిలో రామంతాపూర్‌కు వెళ్లేవారికి 18ఆర్ బస్సులే ప్రధానం. వీరికితోడు ప్రతి రోజు విద్యార్థులు, ఉద్యోగులు, కార్మికులు, స్థానికులు 18ఆర్ బస్ సర్వీసులనే ఆశ్రయిస్తారు. ప్రయాణీకుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని గతంలో అధికారులు దాదాపు నాలుగు బస్సు సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రయాణీకులకు సేవలందించేవి. సికింద్రాబాద్ స్టేషన్ నుంచి ప్రారంభమయ్యే 18ఆర్ లాలాగూడా, తర్నాక, హబ్సిగూడా, రామంతాపూర్, ఓల్డ్ రామంతాపూర్లకు ట్రిప్పులు ఉండేవి. రామంతాపూర్ డివిజన్లోని ఈసేవా, ఆర్టీసీకాలనీ, చర్చికాలనీ, గాంధీనగర్‌కు రెండు బస్సులు, భరత్‌నగర్, కేసీఆర్, కేటీఆర్ నగర్‌కు మరో బస్సు, ఓల్డ్రామంతాపూర్ వరకు ఇంకో బస్సు, ఇలా వేర్వేరు రూట్లలో వేర్వేరు సమయాల్లో దాదాపు నాలుగు బస్సులు అందుబాటులో ఉండేవి. రోజుకు ఒక్కో బస్సు మూడు ట్రిప్పులు నడిపించేవారు. వీటికి తోడు ఉప్పల్ టు కోఠి, ఉప్పల్ టు మెహదీపట్నం వరకు రెండు బస్సులను అధికారులు ట్రైయల్ రన్ సైతం చేశారు. ఇంత వరకు బాగానేవున్నా దాదాపు రెండేండ్లుగా ఒక్క బస్సుకూడా అందుబాటులో లేదు.
తీవ్ర ఇబ్బందుల్లో కాలనీ వాసులు
కాలనీలకు బస్సుల సంఖ్య తగ్గడంతో పేదలు, విద్యార్థులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. 18ఆర్ రూట్లో రామంతాపూర్ డివిజన్‌లోనే ఇసేవా, శారదానగర్, గోకులే నగర్, భరత్ నగర్, ఆర్టీసీకాలనీ, ఓల్డ్ రామంతాపూర్, గాంధీనగర్, చర్చికాలనీ, కేసీఆర్, కేటీఆర్‌తోపాటు తదితర ప్రాంతాలకు చెందిన కాలనీవాసులు, విద్యార్థులు, ఉద్యోగులతోపాటు చిరు వ్యాపారులు, వివిధ పనులకు వెళ్లే వారు వేలల్లో ప్రాయాణిస్తారు. అయితే నాలుగు బస్సులకు ఒక్క బస్సుకూడా అందుబాటులో లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించడంతో ప్రమాదాలకు గురవుతున్నారు. కనీసం రెండు బస్సులనైనా నడిపించాలని స్థానికులు విజ్ఞప్తి చేసినా అధికారులు పట్టించుకోవడం లేదు. దాదాపు రెండేండ్ల నుంచి ఒక్క బస్సుకూడా అందుబాటులో లేదు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రామంతాపూర్‌కు 18ఆర్ బస్సర్విస్లను కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు.