Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుండిగల్/కూకట్పల్లి
అన్ని వర్గాల పేద ప్రజలకు అండగా నిలుస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం వికలాంగులకు చేయూతనిచ్చేందుకు 'గిఫ్ట్ ఏ స్మైల్' కార్యక్రమాన్ని కొనసాగిస్తోందని పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. దీని ద్వారా వారికి మూడు చక్రాల వాహనాలు (స్కూటీలు) అందిస్తూ వికలాంగుల ముఖంలో చిరునవ్వులు పూయిస్తోందని చెప్పారు. బయటకు వెళ్లేందుకు వైకల్యం అడ్డురావద్దనే ఉద్దేశంతో వికలాంగులకు ట్రై సైకిళ్లు, స్కూటీలు అందజేస్తూ అండగా నిలుస్తున్నామని అన్నారు. దుండిగల్ మున్సిపల్ పరిధిలోని మేకల ఫంక్షన్ హాల్లో కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని కార్మిక శాఖమంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో కలిసి కేటీఆర్ వికలాంగులకు ట్రై సైకిళ్లు పంపిణీ చేశారు.కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద, రంగారెడ్డిజిల్లా ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ నవీన్‌రావు కార్యక్రమంలో పాల్గొన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో 300 మంది వికలాంగులకు కేటీఆర్ చేతుల మీదుగా మూడు చక్రాల వాహనాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో టీఎస్ఎండిసీ చైర్మెన్ మన్నె క్రిశాంక్, వికలాంగుల కార్పొరేషన్ అధ్యక్షులు వాసుదేవరెడ్డి, గిఫ్ట్ ఏ స్మైల్ టీమ్ సభ్యులు పాల్గొన్నారు.