Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
అధికార మదంతో ప్రశ్నించే గొంతులను అణిచివేస్తే, దాడులు చేస్తే ప్రతి దాడులు చేస్తామని బహుజన విద్యార్థి సంఘాల నాయకులు అన్నారు. గురువారం సీఎం కేసీఆర్ పుట్టినరోజును నిరుద్యోగుల నిరసన దినంగా పాటిస్తూ సీఎం కేసీసర్ దిష్టిబొమ్మను ఓయూ ఎన్‌ఆర్‌ఎస్‌హెచ్ హాస్టల్‌వద్ద దహనం చేశారు. ఈ సందర్భంగా పోలీసులు వారిని అడ్డుకుని అరెస్టు చేస్తున్న క్రమంలో సమీపంలోనే ఉన్న టీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగబాలు, నాయకులు బోయిళ్ల విద్యాసాగర్‌ల ఆధ్వర్యంలో విద్యార్థులపై దాడికి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. బహుజన విద్యార్థి సంఘాల నాయకులను అరెస్టు చేసి ఓయూ పీఎస్‌కు తరలించారు. టీఆర్ఎస్వీకి చెందిన విద్యార్థి నాయకులు భౌతిక దాడులకు పాల్పడటం ప్రజాస్వామ్య విరుద్ధమని దమ్ముంటే నిరుద్యోగంపై చర్చకు రావాలని బహుజన విద్యార్థి సంఘాల నాయకులు అన్నారు. ''ఎనిమిదేండ్ల పాలనలో ఉద్యోగ నోటిఫికేషన్లు ఎందుకు జారీ చేయలేదు. ఇప్పటి వరకు ఎన్ని ఉద్యోగ ఖాళీలు భర్తీ చేశారు? నిరుద్యోగులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? రాష్ట్రంలోని 33 లక్షల మంది నిరుద్యోగులకు ఏం సమాధానం చెప్తారు? '' అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ పాలనలో డీఎస్సీ, జేఎల్, డీఎల్, గ్రూప్స్ ఉద్యోగాలు, వర్సిటీలలో టీచింగ్ నాన్ టీచింగ్ ఉద్యోగాలు భర్తీ చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై విద్యార్థులంతా కేసీఆర్, కేటీఆర్‌లను నిలదీయాలని పిలుపునిచ్చారు. బహుజన స్టూడెంట్స్ ఫెడరేషన్ అధ్యక్షులు వేల్పుల సంజరు, ఓయు జేఏసీ చైర్మెన్ కొత్తపల్లి తిరుపతి, పులిగంటి వేణుగోపాల్, అంబేద్కర్లు ఉన్నారు.
కొన్ని విద్యార్థి సంఘాల తీరు దుర్మార్గం
ఓయూలో పలు విద్యార్థి సంఘాల తీరు దుర్మార్గమని, సంఘాల ముసుగులో దందాలకు పాల్పడుతూ విద్యార్థి సంఘాల ప్రతిష్ట దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నారని టీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుంగబాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం సీఎం బర్త్ డే సందర్భంగా అందరూ అట్టహాసంగా వేడుకలు జరుపుకుంటుంటే, కొంతమంది విద్యార్థి సంఘాల ముసుగులో ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా సీఎం దిష్టిబొమ్మను దహనం చేసే ప్రయత్నం చేశారన్నారు. అలా చేసినవారు క్షమాపణలు చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో విద్యా సాగర్, నరేశ్, హరిబాబు, కృష్ణ, వెంకటేష్, నవీన్, ఉన్నారు. ఓయూలో విద్యార్థిసంఘాల వేడుకలు, ఆందోళనల నేపథ్యంలో ఇన్స్పెక్టర్ రమేశ్ నాయక్ ఆధ్వర్యంలో ఎన్‌ఆర్‌ఎస్‌హెచ్, ఓల్డ్ పీజీ హాస్టళ్లవద్ద పోలీసు బందో బస్తు నిర్వహించారు. దాడులకు పాల్పడిన టీఆర్ఎస్వీ నాయకులపై కేసులు నమోదు చేయనున్నట్టు ఇన్స్పెక్టర్ తెలిపారు.