Authorization
Sun March 16, 2025 10:41:49 pm
నవతెలంగాణ-ఉప్పల్
పుస్తకాలు పట్టి, పాఠాలు వినే విద్యార్థులే అక్కడ చీపుర్లు పట్టి తరగతి గదులను కూడా శుభ్రం చేస్తున్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని ఉప్పల్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలోని విద్యార్థుల పరిస్థితి ఇది. ఇక్కడ స్వీపర్లు లేక విద్యార్థులే తమ తరగతి గదులను ఊడ్చుకుంటున్నారు. లెక్చరర్ల కొరతవల్ల బోధన కూడా సాఫీగా సాగడం లేదు. మౌలిక వసతులు సరిగ్గాలేవు. దీనిపై అధికారులు ఎవరూ స్పందించడం లేదని, ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్పొరేట్ కాలేజీలకు దీటుగా ప్రభుత్వ కాలేజీలను, పాఠశాలలను బలోపేతం చేస్తామని, కేజీ టు పీజీ ఉచిత విద్యను అమలు చేస్తామని ప్రగల్బాలు పలికిన పాలకులు స్వీపర్లను, లెక్చర్లను, కాలేజీల్లో అవసరమైన సిబ్బందిని ఎందుకు భర్తీ చేయడం లేదని ప్రశ్నిస్తున్నారు. డిగ్రీ కాలేజీలో కనీస వసతులు లేక ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు చెప్తున్నారు.