Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
హైదరాబాద్ మహానగర పాలక సంస్థ నగరంలోని ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగానే మోడల్ శ్మశాన వాటికలను నిర్మిస్తోంది. హైదరాబాద్ మహా నగరంలో ఆధునిక హంగులతో 24 మోడల్ వైకుంఠ ధామాలను మొదటి దశలో రూ.24.13 కోట్లతో జీహెచ్ఎంసీ పూర్తిచేసింది. రెండోదశలో రూ.25.02 కోట్ల అంచనా వ్యయంతో 10 మోడల్ వైకుంఠ దామాలను చేపట్టగా అందులో రూ.1108 కోట్ల వ్యయంతో 5 మోడల్ గ్రేవ్ యార్డ్‌లను పూర్తిచేసింది. మరో 5 శ్మశానవాటిక పనులు వివిధ దశల్లో ఉన్నాయి.
మల్లాపూర్ వైకుంఠధామం కూడా ఎవ్వరూ ఊహించని విధంగా సకల సౌకర్యాలతో ఉండేలా ఆధునిక పద్ధతిలో నిర్మించడంతో చూసే వారు కూడా ఆశ్చర్యానికి గురవుతున్నారు. కాప్రా సర్కిల్ మల్లాపూర్‌లో సుమారు రూ.3 కోట్ల వ్యయంతో నిర్మించిన ఆధునిక వైకుంఠధామాన్ని సకల సౌకర్యాలతో నిర్మించారు.
మల్లాపూర్ పాత శ్మశాన వాటిక అయినప్పటికీ అక్కడ నిర్మించిన సమాధులు కనపడకుండా చుట్టూ పచ్చదనం ఉండేలా సుందరీకరణ మొక్కలు వినూత్నంగా నాటారు. పురాతన సంప్రదాయం ప్రకారంగానే కట్టెల చితిని నిర్వహిస్తున్నారు. కట్టెలతో కాల్చేందుకు వేర్వేరుగా మూడు చితిలను ఏర్పాటు చేయడమే కాకుండా మూడు వెయిటింగ్ రూంలతో పాటుగా బట్టలు మార్చుకునే గదులను ఏర్పాటు చేశారు. మహిళలకు, పురుషులకు వేర్వేరుగా స్నానపు గదులు, మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. తాగునీటి వసతి, ఖాళీ స్థలంలో ఆహ్లాదకరంగా ఉండేలా సుందరీకరణ చేపట్టారు. ఎప్పటికప్పుడు పరిశుభ్రత పాటిస్తున్నారు. ప్రత్యేకంగా ఆఫీస్ రూమ్‌ను కూడా ఇక్కడ నిర్మించారు. కాప్రా సర్కిల్ పరిధిలో 23 కాలనీలలో అక్కడివారే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా దహన సంస్కారాల నిర్వహణకు ఇక్కడికి వస్తారని నిర్వాహకులు తెలిపారు. వైకుంఠ ధామం ప్రధాన కూడలి ఉన్నందున ప్రహరీని కూడా చక్కగా నిర్మించారు ప్రార్థనకోసం హాల్, బూడిద నిల్వ సౌకర్యం, కేశ ఖండన కోసం సరేట్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. వైకుంఠ ధామంలో అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను ఇక్కడ కల్పించారు.