Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
మాండరీన్ భాష శిక్షణ కోసం ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ (ఇఫ్లూ) తైవాన్ ఎకానమిక్ అండ్ కల్చరల్ సెంటర్‌తో ఎంఓయూ కుదుర్చుకుంది. శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఇఫ్లూ వీసీ, యూజీసీ సభ్యులు ప్రొఫెసర్ ఈ. సురేష్ కుమార్, తైవాన్ విద్యా శాఖకు చెందిన సెంటర్ డైరెక్టర్ పీటర్స్ చెన్ పరస్పరం ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ సురేష్ కుమార్ మాట్లాడుతూ తైవాన్‌లో వివిధ యూనివర్సిటీతో కలిసి ఇఫ్లూ మాండరీన్ భాషలో ఉమ్మడి డిగ్రీ ఇవ్వడానికి ప్రయత్నాలు చేయాలని సూచించారు. తైవాన్ ఎకానమిక్, కల్చరల్ సెంటర్ డైరెక్టర్ పీటర్స్ చెన్ మాట్లాడుతూ మాండరీన్ భాష నేర్చుకున్న వాళ్లకి ప్రపంచవ్యాప్తంగా మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని వివరించారు. మాండరీన్ భాషలో నైపుణ్యవంతమైన శిక్షణకు ప్రయత్నం చేస్తున్న ఇఫ్లూని ఆయన అభినందించారు. కార్యక్రమంలో తైవాన్ ప్రతినిధి బృందంలో సైన్స్ అండ్ టెక్నాలజీ డాక్టర్ చిన్ సాన్ వాంగ్, అసోసియేట్ డైరెక్టర్ ఎల్లీ చియాంగ్ పాల్గొన్నారు.