Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ొ ఉద్యోగ నోటిఫికేషన్లు వెంటనే విడుదల చేయాలని ఓయూ విద్యార్థి సంఘాల డిమాండ్
నవతెలంగాణ-ఓయూ
ఉస్మానియా యూనివర్సిటీలో బహుజన విద్యార్థి సంఘాల నాయకులపై టీఆర్ఎస్ శ్రేణుల దాడిని ఖండిస్తూ శుక్రవారం వివిధ విద్యార్థి సంఘాల నాయకుల ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. 'కేసీఆర్ డౌన్..డౌన్, వద్దురా నాయనా కేసీఆర్ పాలనా' అంటూ ఓయూ లైబ్రరీ నుంచి ఆర్ట్స్ కాలేజ్ వరకు ర్యాలీ నిర్వహించారు. బహుజన నాయకులపై దాడికి పాల్పడిన టీఆర్ఎస్ నాయకులని వెంటనే అరెస్ట్ చేయాలని, రెండు లక్షల ఉద్యోగ నోటిఫికేషన్లు వెంటనే విడుదల చేయాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం ఆర్ట్స్ కళాశాల ప్రధాన రహదారిపై బైటాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు మాట్లాడుతూ తెలంగాణలో నిరుద్యోగంతో విద్యార్థులు, యువత ఆత్మహత్యలు చేసుకుంటే కేసీఆర్ జన్మదినాన్ని ఆర్భాటంగా జరుపుకోవడం, అందుకోసం కోట్లాది రూపాయలు ఖర్చుచేయడం సిగ్గుచేటన్నారు. నియామకాల పేరుతో అధికారంలోకి వచ్చి నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టిన టీఆర్ఎస్కు రోజులు దగ్గర పడ్డాయన్నారు. విద్యార్థుల ఉద్యమం లేనిదే తెలంగాణ రాష్ట్రం లేదని, విద్యార్థులతో పెట్టుకున్న ఏ పార్టీ బతికి బట్టకట్టలేదని, రేపు టీఆర్ఎస్కు అదే గతిపడుతుందన్నారు. కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు అర్జున్ బాబు, సురేష్ యాదవ్, బైరి నాగరాజ్, కొప్పుల ప్రతాప్ రెడ్డి, కృష్ణ, అరుణ్ కుమార్, శరత్ నాయక్, వెంకట్ నాయక్, నాగేందర్, భరత్ రెడ్డి, భాస్కర్, ప్రశాంత్, రవి పాల్గొన్నారు. అనంతరం విద్యార్థి నాయకులను పోలీసులు అరెస్టు చేసి ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఓయూలో విద్యార్థుల ఆందోళన నేపథ్యంతో పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.