Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
బడి రూపం మారనుంది. కార్పొరేట్ స్థాయి పాఠశాలలకు దీటుగా తయారు కానుంది. మన బస్తీ- మన బడి కార్యక్రమంలో భాగంగా సర్కారు పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా బడులకు సంబంధించి అదనపు తరగతి గదులు, సరిపడా టాయిలెట్లు, శిథిలావస్థకు చేరిన తరగతి గదులకు మరమ్మతులు తదితర మౌలిక సదుపాయాల కల్పనకు కసరత్తు చేస్తోంది. కాగా ఇప్పటికే జిల్లాలోని ప్రభుత్వ మోడల్ హైస్కూల్ అలియా బాలురు, మహబూబియా ప్రభుత్వ బాలిక పాఠశాలల్లో అభివృద్ధి పనులు జరగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మరికొన్ని స్కూళ్లను ఆధునిక హంగులతో తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలి విడుతలో 239 స్కూళ్లను ఎంపిక చేసింది. త్వరలోనే ఆయా స్కూళ్లలో అభివృద్ధి పనులు చేపట్టనుండగా.. మిగిలిన వాటిని తర్వాత దశలో చేపట్టనున్నారు. అయితే తొలి విడుతలో ఎంపికైనా స్కూళ్లలో మన బస్తీ, మన బడి అమలు, అభివృద్ధి, తీసుకోవాల్సిన చర్యలపై నేడు కలెక్టర్ అధ్యక్షతన మంత్రి శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌కు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, విద్యాశాఖ అధికారులతో సమీక్ష చేయనున్నారు.
హైదరాబాద్ జిల్లాలో 693 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలున్నాయి. ఇందులో 96,039 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు, ఉపాధ్యాయులు, జిల్లా విద్యాశాఖ కృషి వల్ల ప్రభుత్వ బడుల్లో ఎన్రోల్మెంట్ పెరిగింది. విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నా పూర్తిస్థాయిలో వసతులు కల్పించలేకపోతున్నారు. సదుపాయాలు కల్పించేందుకు జిల్లా విద్యాశాఖ సర్వే చేసి వివరాలు సేకరించింది. చాలా పాఠశాలలు అరకోర వసతుల నడమే కొనసాగుతున్నట్టు గుర్తించింది. వీటి ఆధారంగా మన బస్తీ-మన బడికి సంబంధించి తొలి దశలో 50శాతం కంటే ఎక్కువ విద్యార్థులు ఉన్న 35 శాతం స్కూళ్లను తొలి విడుతలో ఎంపిక చేసినట్టు అధికారులు తెలిపారు. ఇందులో అత్యల్పంగా అమీర్‌పేట్ మండల పరిధిలో 4, హిమాయత్‌నగర్, మారేడుపల్లిలో 6 చొప్పున ఉండగా.. అత్యధికంగా బహుదూరపూర మండంలో 34, ఆసీఫ్‌నగర్ 29, బండ్లగూడ 29, చార్మినార్ 18, ఖైరతాబాద్ 16, సికింద్రాబాద్ 16, నాంపల్లి 15, సైదాబాద్ 13, అంబర్‌పేట 12, గోల్కొండ 10, ముషీరాబాద్ 10, షేక్‌పేట 10, తిరుమలగిరి 10 చొపున ఎంపిక చేశారు.
పనుల నిర్వహణకు పది ఏజెన్సీల ఎంపిక
కాగా ఎంపిక చేసిన ఈ పాఠశాలల్లో తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్, తరగతి గదులు, ప్రహారీల నిర్మాణంతో పాటు తరగతి గదిలో విద్యార్థులు, ఉపాధ్యాయులు కూర్చునేందుకు కావాల్సిన ఫర్నిచర్, రాసుకునేందుకు గ్రీన్‌చాక్ బోర్డ్స్, గొడలకు అందమైన రంగులు, డిజిటల్ విద్యకు అవసరమైన ఎలక్ట్రానిక్ వస్తువులను సమకూర్చడం వంటి 12 రకాల మౌలిక సదుపాయాలు కల్పించనున్నారు. ఆయా పనుల నిర్వహణకు ఇప్పటికే పది ఏజెన్సీలను గుర్తించారు. కాగా ఇంజినీరింగ్ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ఎక్కడ ఎలాంటి మౌలిక సదుపాయాలు కల్పించాల్సి ఉంది వంటి అంశాలను పరిశీలించి ప్రాథమిక అంచనాకు వచ్చారు. ప్రస్తుతం ఎంపిక చేసిన 239 బడుల్లో వివిధ మౌలిక సదుపాయాలకు గాను సుమారు రూ.95 కోట్ల వరకు ఖర్చు చేయనున్నట్టు తెలుస్తోంది. అయితే ప్రస్తుత జాబితాలో అద్దె భవనాల్లో కొనసాగుతున్న 21 పాఠశాలలను కూడా చేర్చారు.
అద్దె స్కూళ్ల పరిస్థితి ఎంటి?
హైదరాబాద్ జిల్లాలో 16 మండలాల్లో 693 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా.. ఇందులో దాదాపు వందకుపైగా స్కూళ్లు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మన బస్తీ-మన బడి కార్యక్రమంలో భాగంగా ఎంపిక చేసిన 239 బడుల జాబితాలో అద్దె భవనాల్లో కొనసాగుతున్నా 21 స్కూళ్లను కూడా చేర్చారు. ఇందులో ప్రభుత్వ బడులను పక్కన పెడితే.. అద్దె భవనాలకు సైతం 12 రకాల మౌలిక సదుపాయాలు కల్పిస్తారు? ఒకవేళ కల్పిస్తే.. ఖర్చు ఎవరూ భరించాలి? ప్రభుత్వమా? ఓనరా? అనే విషయంలో స్పష్టత లేదు. సదరు భవనాల్లో ఫర్నీచర్, లైట్స్, ఫ్యాన్స్ వంటి ఏర్పాట్లకు ఇబ్బంది లేకున్నా.. గోడలకు రంగులు, టారులెట్స్ బ్లాక్స్, తదితర ఏర్పాట్లకు సదరు యాజమానులు ఒప్పుకున్నా.. ఖర్చు భరించడానికి ముందుకు వస్తారా? అందుకు సమ్మతిస్తారా? లేక ప్రభుత్వమే భరిస్తుందా? అనేది ప్రశ్నార్థకంగా మారింది.