Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఎల్బీనగర్
జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ)లో ప్రభుత్వ వాటాలను విక్రయించొద్దు అని ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి జి భాస్కర్ రాజు అన్నారు. ఎల్ఐసీలో ప్రభుత్వ వాటాలను ఉపసంహరించుకోవాలన్న మోడీ సర్కారు నిర్ణయంపై ఉద్యోగులు శుక్రవారం కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్ఐసీలో 5% వాటాలు లిస్టింగ్ ద్వారా అమ్మడం పాలసీదారులకు అన్యాయం చేయడమే అని అన్నారు. ఇప్పటికే బీమా ప్రీమియంపై 18% జీఎస్టీ విధించి కోట్లాది పాలసీదారులపై భారం మోపిన మోడీ ప్రభుత్వం, ప్రజల సొమ్మును ఐపీఓ ద్వారా ప్రభుత్వ ఖాతాలో వేసుకోవడం అమానుషమని మండిపడ్డారు. ఉద్యోగ సంఘం అధ్యక్షురాలు పద్మావతి మాట్లాడుతూ బీమా, బ్యాంకింగ్, రక్షణ రంగాల్లో కేంద్ర ప్రభుత్వం విచక్షణ రహితంగా విదేశీ పెట్టుబడులు పెంచుతున్నారని, ఇలాంటి ప్రజా వ్యతిరేక విధానాలను తప్పక తిప్పి కొడతామని ఉద్ఘాటించారు. ఐసీఈయూ దిల్సుఖ్ నగర్ శాఖ జాయింట్ సెక్రెటరీ సోమ్లా నాయక్ మాట్లాడుతూ ప్రభుత్వం అవలంభిస్తున్న కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా మార్చి 28, 29వ తేదీల్లో తలపెట్టిన రెండు రోజుల సార్వత్రిక సమ్మెలో ఎల్ఐసీ ఉద్యోగులు కూడా భాగస్వాములు అవుతారని, ఈ పోరాటంలో ప్రజలందరూ కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఎల్ఐసీ ఉద్యోగులు నర్సింగ్, రామావతార్, గజానంద్, అనురాధ, విజయ, అరుణ, పార్వతి, శోభారాణి, మురళి కృష్ణ, జయశ్రీ, విద్యావతి, శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.