Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఐఎన్టీయూ జాతీయ అధ్యక్షులు జి.సంజీవ రెడ్డి
నవతెలంగాణ-ముషీరాబాద్
కేంద్రంలోని నిరంకుశ బీజేపీ ప్రభుత్వం లాభాలు ఆర్జిస్తున్న ప్రభుత్వరంగ సంస్థలను ప్రయివేటీకరిస్తూ ఉద్యోగ అవకాశాలను ధ్వంసం చేస్తుందని ఐఎన్టీయూ జాతీయ అధ్యక్షులు, మాజీ ఎంపీ జి. సంజీవ రెడ్డి అన్నారు. శుక్రవారం బాగ్లింగంపల్లి ఆర్టీసీ కల్యాణ మండపంలో ఐఎన్టీయూసీ తెలంగాణ, ఏపీ శాఖలు సంయుక్తంగా జి. సంజీవ రెడ్డి 92వ జన్మదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాయి. ఈ కార్యక్రమానికి ఐఎన్టీయూసీ తెలంగాణ శాఖ ప్రధాన కార్యదర్శి ఆర్.డి. చంద్ర శేఖర్ అధ్యక్షత వహించగా దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల నుంచి వందలాదిమంది ఐఎన్టీయూసీ నేతలు హాజరై సంజీవ రెడ్డికి శాలువాలు, ఫూలమాలలతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జరిగిన సభలో సంజీవరెడ్డి మాట్లాడుతూ కేవలం మోడీకి సన్నిహితంగా ఉండే కొంతమంది కార్పొరేట్ స్నేహితుల లబ్ది కోసమే ప్రభుత్వరంగ సంస్థలను అమ్ముకుంటున్నారని ఆరోపించారు. స్వాతంత్య్రం అనంతరం కాంగ్రెస్ పార్టీ దేశంలోని కార్మికుల హక్కుల రక్షణ, శ్రేయస్సు కోసం అనేక చేట్టాలను తీసుకువచ్చిందని గుర్తుచేశారు. కానీ నేడు మోడీ ప్రభుత్వం ఆ చట్టాలను రద్దు చేసి, నాలుగు లేబర్ కోడ్ చేట్టాలను తీసుకువచ్చి దేశంలోని కార్మికుల హక్కులన్నీ హరించివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో కార్మికుల వేతనాలు, సామాజిక, వృత్తి భద్రత, పారిశ్రామిక సంబంధాలు పూర్తిగా దెబ్బతింటాయని తెలిపారు. కేంద్రం ప్రవేశపెట్టిన నూతన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనలను దేశవాప్తంగా మరింత ఉథృతం చేయాల్సిన అవసరముందన్నారు. కార్మిక వ్యతిరేక వైఖరి అవలంభిస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని గద్దెదించేవరకు శ్రామిక వర్గం బలమైన పోరాటాలు నిర్వహించాలని సంజీవ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో దాదాపు 200 మంది ఐఎన్టీయూసీ నేతలు రక్తదానం చేశారు. కార్యక్రమంలో ఐఎన్టీయూసీ జాతీయ ప్రధాన కార్యదర్శి సంజరు సింగ్, ముఖ్య ఉపాధ్యక్షులు జనక్ ప్రసాద్, ఉపాధ్యక్షులు చంద్ర ప్రకాష్ సింగ్, కార్యనిర్వాహక కార్యదర్శి ఎస్, నర్సింహా రెడ్డి, తెలంగాణ శాఖ ప్రధాన కార్యదర్శి నాగన్న గౌడ్, యూత్ చైర్మెన్ సంజరు గబా, వైస్ చైర్మెన్ పవన్ కుమార్ రెడ్డి, జాతీయ నాయకులు ఎంక్యూ ఖమర్, రాష్ట్ర నాయకులు సిరిసల వెంకట్, మోహన్ పాల్గొన్నారు.