Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇన్స్పెక్టర్ అజరు కుమార్
నవతెలంగాణ-ధూల్‌పేట్
మత్తు పదార్థాలతో బంగారు భవిష్యత్తును పాడు చేసుకోవద్దని షాహి ఇనాయత్ గాంజ్ పోలీస్ ఇన్స్పెక్టర్ అజరు కుమార్ అన్నారు. శుక్రవారం చూడీబజార్లోని ప్రధాన హరిజన సేవక మండలి అధ్యక్షుడు కిషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. మత్తు పదార్థాల వాడుకతో భవిష్యత్తు అంధకారం అవుతుందన్నారు. ముఖ్యంగా యువకులు, విద్యార్థులు మత్తు పదార్థాల జోలికి వెళ్లి జీవితాలను వ్యర్థం చేసుకోవద్దని సూచించారు. తల్లిదండ్రులు కూడా వారి పిల్లలను గమనించాలని, మత్తు పదార్థాలు సేవిస్తున్నట్టు తెలిసిన వెంటనే కౌన్సెలింగ్ చేయాలన్నారు. చెడు మార్గాల్లో నడవకుండా, వారి జీవితాలు బాగుపడేలా అవగాహన కల్పించాలన్నారు. మాదక ద్రవ్యాలు, మత్తుపదార్థాలు ఎవరైనా అమ్మినా, కొన్నా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఎస్సై రాఘవేందర్ రెడ్డి పోస్కో చట్టం, మైనర్ల రక్షణ కల్పించే చట్టాల గురించి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి ఎం.ధర్మేందర్, ఉపాధ్యక్షులు డి వెంకటేష్, కార్యవర్గ సభ్యులు నాగిరెడ్డి, జగన్, బుచ్చయ్య, కిషన్, సందీప్, పోమాజీ డిప్యూటీ మేయర్ సందీప్, దేవి నగర్ శేఖర్, సతీష్, అంబేద్కర్ నగర్ రాజు, అనిల్ పాల్గొన్నారు.