Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రముఖ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ
నవతెలంగాణ-సుల్తాన్‌బజార్
తపనకు మించిన తపస్సు లేదనే సిద్ధాంతాన్ని విశ్వసిస్తానని ప్రముఖ సినీ గేయ రచయిత డాక్టర్ సుద్దాల అశోక్ తేజ అన్నారు. తెలంగాణ సారస్వత పరిషత్తు నిర్వహిస్తున్న పరిణతవాణి ప్రసంగ పరంపరలో ఆయన 94వ ప్రసంగం చేశారు. తెలంగాణ సాయుధపోరాట యోధులైన సుద్దాల హనుమంతు కుమారుడిగా చిన్నప్పటి నుంచే పాటలు రాయడం, పాడటం అలవోకగా అబ్బిందని తెలిపారు. నిజానికి తమ ఇంటిపేరు గుర్రంవారని అయితే సుద్దాల గ్రామం నుంచి వచ్చిన కారణంగా సుద్దాల ఇంటిపేరుగా మారిందని చెప్పారు. 1989లో నమస్తే అన్న అనే చిత్రానికి తొలిసారిగా పాట రాశానని ఈ తర్వాత ఒసేరు రాములమ్మ చిత్రంలో రాసిన ఏడు పాటలవల్ల అపారమైన ఖ్యాతి లభించిందని చెప్పారు. చిన్నప్పటి నుంచి. డా.సి.నారాయణరెడ్డి పాటలు వింటూ పెరిగానని, అందుకే ఆయన్ను తన పాటల తండ్రి అని భావిస్తానన్నారు. ఇప్పటివరకు మొత్తం 1600 సినిమాల్లో 2600 పాటలు రాశానని తెలిపారు. కటుకూరు రామచంద్రారెడ్డి స్మృతిగీతం, వెలుగురేఖలు నవల, బతుకుపాటలు, నేను అడవిని మాట్లాడుతున్నాను, ఆకుపచ్చ చందమామ, నేలమ్మ నేలమ్మ గ్రంథాలు వెలువరించానని, నాన్న జీవించి, ఉండగా అసంపూర్తిగా మిగిలిన వీర తెలంగాణ సాంఘిక యక్షగానం పూర్తి చేశానని తెలిపారు. నేలమ్మ నేలమ్మ గ్రంథానికి తెలుగు విశ్వవిద్యాలయం ఉత్తమ గేయరచన పురస్కారాన్ని అందించిందని చెప్పారు. ఠాగూర్ చిత్రంలోని నేను సైతం గీతానికి జాతీయ పురస్కారం లభించిందని, గీతం విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసిందని తెలిపారు. ఇటీవల తీవ్ర అనారోగ్యంతో మరణం అంచులదాక వెళ్లానని, తన కుమారుడు కాలేయదానం చేయటంతో పునర్జన్మ లభించిందని సుద్దాల అశోక్ తేజ చెప్పారు. పరిషత్తు అధ్యక్షులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి అధ్యక్షోపన్యాసం చేస్తూ సుద్దాల అశోక్ తేజ రచించిన గీతాలు బహుళ జనాదరణ పొందాయని అన్నారు. ప్రధాన కార్యదర్శి డా. జుర్రు చెన్నయ్య స్వాగతోపన్యాసం చేశారు. శనివారం ప్రముఖ కవి డా. నాళేశ్వరం శంకరం పరిణతవాణి ప్రసంగం ఉంటుందని తెలిపారు. కోశాధికారి మంత్రి రామారావు వందన సమర్పణ చేశారు.