Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి కృష్ణ స్వరూప్
నవతెలంగాణ-హిమాయత్‌నగర్
కాషాయ ఉగ్రవాదుల రాజ్యాన్ని కూల్చి అంబేద్కర్ సమత రాజ్యస్థాపన నిర్మిద్దాం అని దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి కృష్ణ స్వరూప్ అన్నారు. ఫెడరల్ ఫ్రంట్ పేరుతో సీఎం కేసీఆర్ నాటకీయ రాజకీయాలకు తెరలేపడం అత్యంత మోసపూరితమని ఆరోపించారు. శుక్రవారం హిమాయత్‌నగర్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ లేని తతీయ జాతీయ ఫెడరల్ ఫ్రంట్ అంటూ సరికొత్త నాటకాలకు పాల్పడటం సిగ్గుచేటు అన్నారు. రాజ్యాంగం పట్ల గౌరవం, కనీస అవగాహన లేకుండా నిస్సిగ్గుగా మాట్లాడుతున్న కేసీఆర్‌కు సీఎం పదవిలో కొనసాగే నైతిక అర్హత లేదన్నారు. ఈ ఫ్రంట్ల ఏర్పాటు వ్యాఖ్యల వెనుక ప్రధాని నరేంద్రమోడీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, అంతర్ జాతీయ ఆర్య బ్రాహ్మణ వైదిక మత సంస్థలు, అంబానీ, అదానీల హస్తం ఉందని ఆరోపించారు. వీరందరూ దేశంలో ప్రజాస్వామిక, లౌకిక రిపబ్లిక్, సోషలిస్టు రాజ్యాంగ వ్యవస్థను కూల్చి హిందూ ఫాసిస్టు పాలన తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. కేసీఆర్ తమ జన్మదినోత్సవం సందర్బంగా కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఆకాంక్షలు నీళ్లు, నిధులు, నియామకాలు మర్చిపోయారని ఆందోళన వ్యక్తం చేశారు.
రెండు లక్షలకు పైగా ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వకుండా నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నారన్నారు. కేసీఆర్ పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీలపై ఆధిపత్య కులాల దాడులు ఏడు వేలకు పెరిగాయని, కేసులు కూడా నమోదు అయ్యాయని గుర్తు చేశారు. బీజేపీ, టీఆర్ఎస్, ఆర్ఎస్ఎస్, ఎంఐఎం నయా కాషాయ పాలనకు ప్రత్యామ్నాయం దళిత బహుజన శక్తులేనని ఆయన ప్రకటించారు. ఈ దోపిడీ రాజకీయ పార్టీల పాలనను అంతం చేసి డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ సమతా రాజ్య స్థాపనకు దళిత విప్లవ ప్రజా ఉద్యమ సంస్థలు ఐక్యం కావాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన సూచించారు.