Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సుల్తాన్‌బజార్
రెండు లక్షల పుస్తకాలతో మహా గ్రంథాలయాన్ని ఒక గ్రామంలో నెలకొల్పిన స్వప్నం నెరవేరిందని, ఇకపై ఉన్న పుస్తకాలను ఇంటింటికి తీసుకువెళ్లి చదివించేందుకు వీధి వీధి గ్రంథాలయం అనే లక్ష్యమే మిగిలిందని ప్రముఖ సాహితీవేత్త డా.కూరెళ్ల విఠలాచార్య తెలిపారు. తెలంగాణ సారస్వత పరిషత్ నిర్వహిస్తున్న పరిణతవాణి ప్రసంగ పరంపరలో ఆదివారం ఆయన పరిణతవాణి 96వ ప్రసంగం చేస్తూ పుట్టిన 5 నెలలకే తండ్రి మరణిస్తే కన్న తల్లి వర్ణించనలవిగాని కష్టాలకోర్చి నన్ను పెంచి పెద్ద చేసిందని గుర్తు చేసుకున్నారు. అమ్మమ్మ, మేనమామల ఆదరణతో చదువుకోసం అన్వేషణ ప్రారంభించానని, భువనగిరిలో విద్యాబిక్ష ఒకవైపు, అన్నబిక్ష మరొక వైపు అన్నట్టుగా ఆరోజులు గడిచాయని విఠలాచార్య చెప్పారు. ఉన్నత విద్యతోపాటుగా తెలుగు భాషా సాహిత్యాల్లో 'తెలుగులో గొలుసుకట్టు నవలలపై ఎం.ఫిల్ పూర్తి చేశానని, ఆ దశలో బి.రామరాజు, డా.సి. నారాయణరెడ్డి వంటి గురువుల ఆశీస్సులు లభించాయని వివరించారు. పద్యం రాసినా, గద్యం రాసినా అభ్యుదయ భావాలను ప్రయోగించానని, 6 ఎకరాల సొంతభూమిని బలహీన వర్గాలకు ఇండ్ల నిర్మాణంకోసం దానం చేశానని చెప్పారు. ఉపాధ్యాయునిగా 3 దశాబ్దాలకు పైగా సేవలందించి పదవీ విరమణ సమయంలో లభించిన 50లక్షల రూపాయలతో ఇల్లు నిర్మించానని, పల్లెటూరులో ఒక మహా గ్రంథాలయం నెలకొల్పాలన్న సంకల్పంతో ఒక ఉద్యమంలా పనిచేసి సుమారు 2లక్షల పుస్తకాలు సేకరించి ఇల్లే గ్రంథాలయంగా రూపొందించానని తెలిపారు. పరిషత్తు అధ్యక్షులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి విఠలాచార్యను సత్కరించడంతో పాటు పరిషత్తు తరపున గ్రంథాలను బహుకరించారు. పరిషత్తు ప్రధాన కార్యదర్శి డా.జుర్రు చెన్నయ్య స్వాగతోపన్యాసం చేశారు. సోమ వారం ఉదయం ప్రముఖ కవి డా.నలిమెల భాస్కర్చే పరిణతవాణి 97వ ప్రసంగం ఉంటుందని తెలిపారు.