Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అబ్బాస్
నవతెలంగాణ-హైదరాబాద్/ధూల్‌పేట్
మైనారిటీ మహిళలు నేడు అన్ని రంగాలలో ముందుకు వస్తున్నారని, వారి ఎదుగుదలను నిర్లక్ష్యం చేయకుండా వారి అభివద్ధికి సహకరించాలని ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అబ్బాస్ పిలుపునిచ్చారు. ఆవాజ్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ ఆధ్వర్యంలో ముషీరాబాద్‌లో నిర్వహించిన మెహందీ డిజైనర్ల పోటీల్లో పాల్గొని విజయం సాధించిన విజేతలకు బహుమతుల ప్రదానోత్సవం జరిగింది. సభకు ఆవాజ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి రఫత్ అంజుమ్ అధ్యక్షత వహించారు.
ఈ సభలో మహమ్మద్ అబ్బాస్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ముస్లిం మహిళలు తమ నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని, తమ కాళ్ళపై తాము నిలబడి సాధికారత సాధించాలని అన్నారు. ముస్లిం మహిళలు విద్యలో, ఉద్యోగాలలో వెనుకబడి ఉన్నారు. పేదరికం వలన చదువులో ముందుకు వెళ్ళలేక పోతున్నారు. ప్రభుత్వాలు ముస్లిం బాలికల విద్య కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. భార్యా భర్తలు పనిచేస్తేనే కుటుంబాలు గడిచే పరిస్థితి ఉన్న ఈ పరిస్థితుల్లో ఆదాయాన్ని అందించే పనిలో ముస్లిం మహిళల భాగస్వామ్యం తక్కువగా ఉందని, దీనివల్ల కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయని అన్నారు. ఆర్థిక ఇబ్బందులతో ముస్లిం బాలికలు చదువులు మధ్యలోనే మానేస్తున్నారని అన్నారు. అనేక ఆటంకాలు ఎదుర్కొని ముస్లిం మహిళలు ఇప్పుడిప్పుడే చదువుకోవడానికి, బయట పనిచేయడానికి ముందుకు వస్తున్నారని, వారిని 'హిజాబ్' పేరుతో విద్యకు, ఉపాధికి దూరం చేయొద్దని అన్నారు. మతోన్మాద శక్తులు తమ రాజకీయ ప్రయోజనాల కోసం ముస్లిం మహిళల చదువుకునే, జీవించే హక్కుతో ఆడుకోవద్దని హితవు పలికారు. ముస్లిం మహిళలలో దాగిఉన్న ప్రతిభా పాటవాలను వెలికితీసి, వారి నైపుణ్యాలకు మరింత మెరుగుపరిచేందుకు ఆవాజ్ కషి చేస్తున్నదని అన్నారు. మెహందీ డిజైనర్ల పోటీల్లో పాల్గొన్న వారిని అభినందిం చారు. భవిష్యత్తులో ఇలాంటి అనేక కార్యక్రమాలు నిర్వహించాలని ఆవాజ్ భావిస్తున్నదని, దానికి అందరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నియోకర్శర్ కార్యదర్శి జగదీష్ కుమార్, ఆవాజ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అజీజ్ అహమ్మద్ ఖాన్, ఇబ్రహీం, ఆవాజ్ మహిళా నాయకులు మొయిన్ బానో, షేక్ రిజ్వానా, సయ్యదా తన్వీర్ అలియా, తబస్సుమ్ తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వం మైనార్టీ సబ్ ప్లాన్ ప్రకటించాలి
రాష్ట్రంలో ముస్లిం మైనార్టీల సంక్షేమం పట్ల నిర్లక్ష్యం తగదని ఆవాజ్ రాష్ట్ర కార్యదర్శి మహమ్మద్ అబ్బాస్ అన్నారు. ప్రభుత్వం మైనార్టీ సబ్ ప్లాన్ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం ఆవాజ్ హైదరాబాద్ సౌత్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ముస్లిం మైనార్టీల సంక్షేమాన్ని ప్రభుత్వం గాలికి వదిలేసిందన్నారు. దీంతో నగరంలో ముస్లింలు తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురికావడం జరుగుతుందన్నారు. మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఆదుకోవాలన్నారు. బడ్జెట్లో కోటా పెంచాలని, ఏపీ ప్రభుత్వం మైనార్టీలకు సబ్ ప్లాన్ ఇస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించాలని డిమాండ్ చేశారు. పై సమస్యలపై కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని ఆవాజ్ హైదరాబాద్ సౌత్ జిల్లా కమిటీ నగర కార్యదర్శి అబ్దుల్ సత్తార్ పిలుపు ఇచ్చారు. సమావేశంలో జిల్లా నాయకులు మహమ్మద్ కలీముద్దీన్, షేక్ యాకూబ్, సయ్యద్ ఇఫ్తేఖార్, గులాం నసీర్, మహ్మద్ అన్వర్ ఖాన్, అఖ్తర్ బేగం, సయ్యద్ ఇబ్రహీం, మహ్మద్ ఖాదర్, మహ్మద్ కరీం, మహ్మద్ అహ్మద్, మహ్మద్ అసద్ తదితరులు పాల్గొన్నారు.