Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బంజారాహిల్స్
రాష్ట్ర జనాభాలో 12 శాతం ఉన్న ఆదివాసీ గిరిజనులకు ప్రత్యేక ఎస్టీ కమిషన్ ఏర్పాటుచేయాలని నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఉషాకిరణ్ డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఈ కమిషన్ను అమలు చేయడంలో నిర్లక్ష్యం చేస్తున్నదని ఆయన ఆరోపించారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉషా కిరణ్ మాట్లాడుతూ సర్కారు గిరిజనులను నిర్లక్ష్యం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్టీల హక్కుల పరిరక్షణ కోసం జాతీయ స్థాయిలో ఎస్టీ కమిషన్ ఉందని, కేంద్ర ప్రభుత్వ ఆమోదంతో రాష్ట్రాల్లోనూ ప్రత్యేక ఎస్టీ కమిషన్లు ఏర్పాటు చేసే వీలు ఉండంగా, టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం పట్టనట్లుగా వ్వవహరిస్తోందని ఆరోపించారు. పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ కంటే తక్కువ ఎస్టీ జనాభా ఉన్నా కూడా ప్రత్యేక ఎస్టీ కమిషన్ వేశారని గుర్తు చేశారు. తెలంగాణలో మాత్రం ఎస్టీ, ఎస్సీలకు కలిపి కమిషన్ ఏర్పాటు చేశారని, దీనివల్ల ఎస్టీలకు తీవ్ర నష్టం కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణలోనే 32 లక్షల ఆదివాసీ, గిరిజనులు ఉన్నారన్నారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలు రెండూ సమాజంలో అణచివేతకు గురవుతున్నా, ఎస్టీలకు సంబంధించి సమస్యలు ప్రత్యేకంగా ఉంటాయన్నారు. మారుమూల అటవీ ప్రాంతాల్లో నివసించే గిరిజనులకు చట్టాలపై కనీస అవగాహన కూడా లేకపోవడంతో ఎక్కువ అన్యాయానికి గురవుతున్నారన్నారు. సుధీర్ఘ కాలంగా ఎస్టీ కమిషన్ సాధించడమే లక్ష్యంగా పోరాటం చేస్తున్నామని, ఇటీవల ఢిల్లీలో ఈ ఆంశపై నేషనల్ ఎస్టీ కమిషన్ కు ఫిర్యాదు చేయడం జరిగిందని, త్వరగా ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేసేలా తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించాల్సిందిగా కోరారు. సమావేశంలో రాష్ట్ర వర్కింగ్ ప్రసిడెంట్ వి. తిరుపతి, ప్రదాన కార్యదర్శి యెల్లం దేవరాయ పాల్గొన్నారు.