Authorization
Mon Jan 19, 2015 06:51 pm
డాక్టర్ పిడమర్తి రవి
నవతెలంగాణ-బంజారాహిల్స్
రెండు తెలుగు రాష్ట్రాల్లో మార్చి 10,11,12 తేదీల్లో మాదిగ సంఘాల ప్లీనరీ సమావేశాలు నిర్వహిస్తామని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మెన్ డాక్టర్ పిడమర్తి రవి తెలిపారు. సోమవారం ఖైరతాబాద్ మింట్ కాంపౌండ్ అంబేద్కర్ స్ఫూర్తి భవన్లో తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలలోని 18 మాదిగ సంఘాలు నిర్వహించిన సమావేశంలో ఉమ్మడి నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుత పార్లమెంటులో ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశ పెట్టి తెలంగాణలో మాదిగలకు 12 శాతం, ఆంధ్రప్రదేశ్తెనొ మాదిగలకు ఏడు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకపోతే బీజేపీని రెండు తెలుగు రాష్ట్రాల్లో బొంద పెట్టడం ఖాయమని హెచ్చరించారు. మార్చి 10 న మాదిగ మేధావులుతో సుందరయ్య విజ్ఞాన్ భవన్లో మాదిగల సమగ్ర అభివద్ధిపై మేధోమథనం సమావేశం 11న మహాసభ, 12న పొలిట్ బ్యూరో సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు. మూడు రోజులు నిర్వహించే ఈ మాదిగ ప్లీనరీ సమావేశాలకు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నుంచి వేలాదిగా మాదిగ నాయకులు కార్యకర్తలు తరలిరావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏపీ ఎమ్మార్పీఎస్ దండు వీరయ్య, పేరుపోగు వెంకటేశ్వరరావు, తెన్నేటి కిషోర్ మాదిగ, తెలంగాణ మాదిగ జేఏసీ డాక్టర్ బుల్లి కొండ వీరేందర్, టీఎమ్మార్పీఎస్ ఇటుక రాజు మాదిగ, రాయి కంటి రామదాస్, గడ్డ యాదయ్య, మైసా ఉపేందర్, ముత్యపాగ నర్సింగరావు, గజ్జల మల్లికార్జున్, గ్యార వెంకటేష్, జున్ను కనకరాజు, డాక్టర్ చీమ శ్రీనివాస్, మర్మల మల్లేష్ పాల్గొన్నారు.