Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బంజారాహిల్స్
ఆర్టీపీసీఆర్ టెస్టుల కోసం సర్కారు సెంటర్లలో శాంపిల్స్ ఇచ్చిన వారికి రిపోర్టులు త్వరగా అందడం లేదు. ఐదారు రోజులైనా రిజల్ట్ తెలియడం లేదు. టెస్టింగ్ సెంటర్‌కు వెళ్లి అడిగితే అక్కడి సిబ్బంది సరైన జవాబు చెప్పడం లేదు.దీంతో జనం ప్రయివేటు సెంటర్లకు వెళ్తున్నారు.
అక్కడ చేయించుకున్న టెస్టులో నెగటివ్ వచ్చినా.. సర్కారు సెంటర్లో ఇచ్చిన శాంపిల్‌లో పాజిటివ్ వస్తోంది.ప్రభుత్వ సెంటర్ రిపోర్టు వచ్చే సరికి బాధితులు కోలుకుంటుండటమే ఇందుకు కారణం. మరోవైపు యాంటీజెన్ టెస్టులో నెగెటివ్ వచ్చినా.. లక్షణాలు ఉన్న వాళ్లు ఆర్టీపీసీఆర్ టెస్టులకు వెళ్తున్నారు. కానీ చాలా సెంటర్లలో ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయడం లేదు.
కొన్ని చోట్ల టెస్టులు చేస్తలే..
ఆర్టీపీసీఆర్ టెస్టు కోసం శాంపిల్ తీసుకున్న కొద్ది గంటల్లోనే రిజిస్టర్ అయినట్లు ఫోన్లకి మెసేజ్‌లు వస్తున్నాయి. ఆ తర్వాత ఎలాంటి స్పందన ఉండటం లేదు. కరోనా సోకిందా లేదా అన్న విషయం తెలియకపోవడంతో టెన్షన్ తట్టుకోలేక కొందరు ప్రయివేట్ సెంటర్లకు వెళుతున్నారు. రిపోర్టులు త్వరగా రాకపోవడం వల్లే ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయడంలేదని పలు సెంటర్లలో హెల్త్ స్టాఫ్ చెబుతున్నారు. తాము శాంపిల్స్ కలెక్ట్ చేసి, అదేరోజు వైరస్ రీసెర్చ్ అండ్ డయాగస్టిక్ ల్యాబోరేటరీ (వీఆర్డీఎల్) సెంటర్లకు పంపుతున్నా.. అక్కడి నుంచి మెసేజ్‌లు రావడంలేదని అంటున్నారు. అందుకే యాంటీజెన్ టెస్టులే చేస్తున్నట్లు చెబుతున్నారు. ఆర్టీపీసీఆర్ టెస్టులకు శాంపిల్స్ తీసుకోవద్దని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందినట్లు తెలిసింది.
ప్రయివేట్ సెంటర్లే దిక్కు
ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయించుకునేందుకు జనానికి ప్రైవేట్ సెంటర్లే దిక్కు అవుతున్నాయి. గతంలో కరోనా అనుమానితులు ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయించుకునేందుకు చాలా సెంటర్లతో పాటు ప్రత్యేకంగా బస్సులు, గ్రేటర్లో వందకుపైగా ఈ-మొబైల్ వెహికల్స్ ఉండేవి. కాలనీలు, ఇండ్లకు సమీపంలోనే ఆర్టీపీసీఆర్ టెస్టులు చేసుకునేందుకు వీలుండేది. ప్రస్తుతం మొబైల్ టెస్టింగ్ సెంటర్లు ఎక్కడా కనిపించక ప్రైవేట్ ల్యాబ్‌లో టెస్టులు చేయించుకుంటున్నారు. అక్కడ రూ.750 పైనే ఉంటోంది.
వీఆర్డీఎల్ సెంటర్లలో నిర్లక్ష్యం
హైదరాబాద్‌లో 96 సెంటర్లలో కరోనా టెస్టులు చేస్తున్నట్లు ఆఫీసర్లు చెబుతున్నారు. అన్ని చోట్ల యాంటీజెన్, ఆర్టీపీసీఆర్ టెస్టులకు శాంపిల్స్ కలెక్ట్ చేసే వెసులుబాటు ఉంది. కానీ కొన్ని సెంటర్లలో ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయడం లేదని, వేరే సెంటర్లకు వెళ్లాలని ముందుగానే చెబుతున్నారని బాధితులు అంటున్నారు.పరిధిలో డైలీ మూడు వందల వరకు ఆర్టీపీసీఆర్ టెస్టుల కోసం శాంపిల్స్ కలెక్ట్ చేస్తున్నారు. అదేరోజు ట్యాబ్‌లో డేటా ఎంట్రీ చేసి మధ్యాహ్నం తర్వాత వీఆర్డీఎల్ సెంటర్లకు శాంపిల్స్ పంపుతున్నారు. ఇక్కడే పూర్తి నిర్లక్ష్యం కనిపిస్తున్నది. వచ్చిన శాంపిల్స్‌ను వచ్చినట్లుగా టెస్టు చేయకపోతుండటంతో రిపోర్టులు త్వరగా అందడంలేదు.దీంతో శాంపిల్స్‌ను అసలు టెస్టులు చేస్తున్నారా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
యాంటీజెన్ టెస్టులే
హైదరాబాద్‌లో అన్ని సెంటర్లలో యాంటీజెన్ టెస్టులు చేస్తున్నారు. 20 రోజులుగా గ్రేటర్ పరిధిలో డైలీ వేయికి పైగా కేసులు నమోదవుతున్నాయి. నెగటివ్ వచ్చిన వారికి ఆర్టీపీసీఆర్ టెస్టులు చేస్తే పక్కా రిజల్ట్ వచ్చే చాన్స్ ఉంది. కానీ యాంటీజెన్లో నెగటివ్ వచ్చి, సింప్టమ్స్ ఉన్నా కూడా నెగెటివ్ సర్టిఫికెట్‌నే ఆన్లైన్లో పంపుతున్నారు. దీంతో చాలా మంది బయట తిరిగేస్తున్నారు. ఇతరులకు వైరస్ అంటిస్తున్నారు. అదే ఆర్టీపీసీఆర్ టెస్టు చేస్తే కచ్చితంగా రిజల్ట్ వస్తుంది. కానీ ఆఫీసర్లు ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదు.
3 రోజులైనా రిపోర్టు రాలే..
జ్వరం, బాడీ పెయిన్స్, సర్ది, దగ్గు ఉండటంతో నాలుగు రోజుల కిందట గోల్కొండ ఏరియా ఆస్పత్రికి వెళ్లి యాంటీజెన్ టెస్టు చేయించుకున్న. అందులో నెగటివ్ వచ్చింది. లక్షణాలు ఉండటంతో ఆర్టీపీసీఆర్ టెస్టుకు శాంపిల్ ఇచ్చా. రెండు, మూడు రోజులు చూసినా రిపోర్టు రాలేదు. ప్రైవేట్ సెంటర్‌కి వెళ్లి టెస్టు చేయించుకున్న. నెగటివ్ రావడంతో ఊపిరి పీల్చుకున్న.
ఈ గ్యాప్‌లో నాకు కరోనా వచ్చిపోయిందని అనుకుంటున్న తరుణంలో రిపోర్ట్లలో ఇటువంటి విచారకరమైన ఈ పరిణామాలు చోటు చేసుకోవడం వలన ఏమి చేయాలో పాలుపోక ఇబ్బందులకు గురవుతున్నామని మానసిక ఒత్తిడికి గురి కావడం వల్లే జబ్బుల బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.